అనంతపురం జిల్లా సింగనమల మండలం లోలూరు గ్రామంలో కిడ్నాప్ కలకలం రేగింది. గ్రామానికి చెందిన ముగ్గురు వాలంటీర్లు... ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేశారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.... గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు కుట్టు మిషన్‌కు కావాల్సిన దారాలు కొనేందుకు ఈ నెల 25న ఇంటి నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో గ్రామానికి చెందిన వాలంటీర్లు చంద్ర శేఖర్, శివరాం, మధు, మరో ఇద్దరితో కలిసి బాలికలను బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు.
బాలికలు కనిపించకపోవటంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాలికలను అనంతపురంలో నిర్బంధించినట్లు గుర్తించిన పోలీసులు.. వారిని విడిపించారు. ఈ నెల 26న వారిద్దరినీ కుటుంబసభ్యులకు అప్పగించారు. కిడ్నాప్ చేసిన తరువాత తమకు మత్తు మందు ఇచ్చారని బాధిత బాలికలు తెలిపారు. స్పృహలోకి వచ్చిన తరువాత చూస్తే ఎక్కడున్నామో అర్థం కాలేదని చెప్పారు. పోలీసులే తమను విడిపించారని వెల్లడించారు.