కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో లాక్డౌన్ నడుస్తోంది. నిత్యావసర వస్తువులు తప్పితే అన్ని వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. దీంతో పేదలు, అనాథలకు భోజనం దొరకని పరిస్థితి నెలకొనడంతో కొంతమంది దాతలు పేదలకు ఆహారపొట్లాలు, నిత్యావసర సరుకులు, మాస్క్‌లను పంపిణీ చేశారు.
అనంతపురంలో
అనంతపురంలోని మహాలక్ష్మి టెక్స్ టైల్స్ యజమాని త్రిలోక్ నాథ్ జైన్ ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకులకు పొంగలి, చిత్రాన్నం పంపిణీ చేయగా ఓ బీటెక్ విద్యార్థిని తన తమ్ముడి జన్మదినం సందర్భంగా మాస్క్‌లు పంచిపెట్టారు. ఆర్యవైశ్య, దాల్ మర్చంట్స్ సంఘాలు, పారిశుద్ధ్య కార్మికులు... యాచకులకు ఉగ్గాని పెట్టారు. పోలీసులు, మీడియా ప్రతినిధులకు మజ్జిగ ప్యాకెట్లిచ్చి దాహార్తి తీర్చారు. పెనుకొండలో 56 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఎస్‌ఆర్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేశారు. ఉరవకొండకు చెందిన హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్ మాస్క్‌లు అందించారు. ధర్మవరంలో బిచ్చగాళ్లకు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్థానిక పాఠశాలలో బస ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో సరుకులు పంపిణీ చేస్తామని ఓ సంస్థ ముందుకొచ్చిన పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆ సంస్థ, గ్రామ ప్రజలు మండిపడ్డారు.
కడపలో
కడప జిల్లా వేంపల్లి కూరగాయల మార్కెట్‌లో జెడ్పీటీసీ రవి కుమార్ రెడ్డి మాస్కులు పంచిపెట్టారు. రాయచోటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం.. అన్నార్థులకు భోజనం అందించింది. జిన్నా సేవా సంస్థ యాచకులు, విధినిర్వహణలోని ప్రభుత్వ సిబ్బందికి తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసింది.
కృష్ణా జిల్లాలో
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పోలీసులకు వెయ్యి మాస్కులు ఉచితంగా అందజేయగా... మైలవరంలో ద్వారకా తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో అల్పాహారం పంచారు. విజయవాడ రోటరీ క్లబ్ సభ్యులు పోలీసు శాఖ సహకారంతో ప్రధాన కూడళ్లలో నిరాశ్రయులకు ఆహారం, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.
గుంటూరులో
గుంటూరులో కొందరు శానిటైజర్ తయారు చేసి చిన్న డబ్బాల్లో నింపి రోజూ 10 మందికి అందిస్తున్నారు. చిలకలూరిపేటలో పోలీసులకు అల్పాహారం, భోజనం ప్యాకింగ్ చేసి అందిస్తూ ఆకలి తీరుస్తున్నారు. కొందరు హోటల్ యజమానులు రహదారి పక్కనే ఉన్న నిరాశ్రయుల కడుపు నింపుతున్నారు.