రాజుగారికే కాదు... ఆయన కుక్క గారికీ ఎంతో గౌరవం ఆ ఊళ్లో! అందుకే దాని పేరుమీదనే ‘శునకరేడుపురం’ అని పెట్టేశారు. ముద్దుగా ‘కుక్కరాజులపల్లె’ అని కూడా పిలుచుకుంటున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలో ఉన్న ఈ ఊళ్లో ఒక రాజు తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్కను చిన్న పొరపాటు వల్ల చేతులారా చంపేశాడట. తర్వాత నిజం తెలుసుకుని దానికి ప్రాయశ్చిత్తంగా తనూ ప్రాణాలు విడిచాడట. దీనికి గుర్తుగానే ఊరి పేరు అలా స్థిరపడిందన్నమాట. అనంతపురం జిల్లాలోని కాకి గ్రామాని కథ ఉంది. మీ ప్రాంతం నెమలిపింఛంలా అందంగా ఉంది అనే అర్థంలో ‘ఇట్స్ లైక్ పీకాక్’ అని విదేశీయులు అన్నారట. దాన్ని కొన్నాళ్లు పీకాకీ అనీ, ఆ తర్వాత ‘కాకి’ అనీ అనడం మొదలెట్టారు.
‘వానపాముల’ అనే ఇంటి పేరుతో కృష్ణాజిల్లాలో ఓ మునసబు పనిచేసేవారట. ఆయన మీద అభిమానంతో దాన్నే తమ ఊరి పేరు చేసుకున్నారా ప్రజలు. వేవేల గోవులతో అలరారినందుకు తమ ఊరినే ‘కామధేనువు’ చేశారు శ్రీకాకుళం జిల్లాలోని ఆ గ్రామ గోపన్నలు.
వైజాగ్‌లో 'కొలంబో'
శ్రీలంక రాజధాని ‘కొలంబో’ పేరుతో విశాఖ జిల్లా మన్యంలో ఓ గిరిజన పల్లె ఉంది! అప్పట్లో ఇక్కడ కొలిమికాయలు అనే పంట బాగా పండేదట. దాంతో ఈ ప్రాంతాన్ని స్థానికులు కొలిమి అని పిలిచేవారు. దాని నుంచే ఆ తర్వాత కొలంబో అనడం అలవాటైందంటారు ఊరి పెద్దలు. ఇక ఈ ఊరి పేరు చదివితే మాత్రం ఇదేమి చోద్యం అనకుండా ఉండలేరు. ఎందుకంటే ఆ ఊరిపేరే ‘చోద్యం!’ విశాఖ జిల్లాలో ఉందిది. తెలుగువారంటేనే భోజన ప్రియులు. మరి దానికీ ఊరి పేర్లలో స్థానముండాలిగా! అందుకే ‘భోజనం’ అనే పేరు పెట్టేశారు. కర్నూలు జిల్లాలోని ఈ గ్రామంలో అప్పటి రాజులు అన్నార్తులకు నిత్యం స్వయంగా భోజనం వడ్డించేవారట. అందుకే దీనికా పేరొచ్చిందని చెబుతారు.
దీపావళి 'గలగల'
అమ్మాయి చేతిగాజులు చేసే గలగల చప్పుళ్లు ఎంత బావుంటాయో... ‘గలగల’ ఊరు కూడా అంతే బావుంటుంది..! అనంతపురం జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో ఒకప్పుడు గాజులు తయారు చేసేవారట. ఊరంతా అదే పని చేస్తుండటంతో దీనికి ఆ పేరు పెట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఊరి పేర్ల తీరే వేరు. అప్పట్లో ఒక రాజు నరక చతుర్దశి రోజు గుడికివెళుతూ అస్వస్థతకు గురై కింద పడిపోయాడట. అప్పుడు స్థానికులు ఆయనకు సపర్యలు చేసి కాపాడారు. దీపావళి రోజున తన ప్రాణాలు నిలిపినందుకు గుర్తుగా ఆ ఊరికి ఆయన ‘దీపావళి’ అనే పేరు పెట్టాడని ప్రతీతి. ‘వసుంధర’ అనే గ్రామానికి తమ ఊరి జనమంతా సహనంతో ఉంటూ ఖ్యాతి గడించేలా ఎదగాలన్న ఉద్దేశంతో పెద్దలు ఆ పేరు నిర్ణయించారు. ఇవే కాదండోయ్... పందెం, 150వ మైలు, మల్లి, ముష్టూరు, మెచ్చిరి... ఇలాంటి ఎన్నో ఊళ్లున్నాయ్. తెలుసుకునే మనసుండాలే కానీ... మనం పలికే ప్రతిపల్లె పేరు వెనుకా ఎన్నెన్నో కథలున్నాయ్.
ఇదీ చదవండి: ప్రజలకు మాస్కులు పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశం