నిరుద్యోగుల కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం.. విద్యార్థులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
Unemployees protest: రాష్ట్రంలో కలెక్టరేట్ల ఎదుట విద్యార్థి ఉద్యమం దద్దరిల్లింది. ఖాళీగా ఉన్న 2 లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థి సంఘాలు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎక్కడికక్కడ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన తెలుపుతున్న విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
Unemployees protest
By
Published : Feb 10, 2022, 9:51 AM IST
|
Updated : Feb 11, 2022, 4:28 AM IST
నిరుద్యోగుల కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం..
Unemployees protest: ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్న ప్రధాన డిమాండుతో తెలుగుయువత, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, టీఎన్‌ఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, డీవైఎఫ్‌ఐ తదితర విద్యార్థి సంఘాలు సంయుక్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. భారీఎత్తున అరెస్టులూ జరిగాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు జిల్లా కేంద్రాల్లో పలు విద్యార్థి సంఘాల నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయినా కొందరు పోలీసుల కళ్లుగప్పి కలెక్టరేట్ల ప్రాంతాలకు ఉదయమే చేరుకున్నారు. ఓ పక్క పోలీసులు తమను వ్యాన్లలోకి ఎక్కిస్తున్నా డిమాండ్లపై గళమెత్తారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడుగుతుంటే అరెస్టు చేస్తారా అని విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులను పలుచోట్ల నిలదీశారు.
విజయవాడలో గురువారం ఉదయం లెనిన్ కూడలిలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్దకు ప్రదర్శనగా బయలుదేరిన నాయకులను పోలీసులు అడ్డుకుని, 62 మందిని అరెస్టుచేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. కర్నూలులో నిరుద్యోగ యువకులు కలెక్టరేట్ గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పలువురు యువకులు రహదారిపై పడుకొని నిరసన తెలిపారు. విశాఖలోని కేజీహెచ్ వద్ద, కలెక్టరేట్ దగ్గర తెదేపా రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్ తదితర 32 మంది నాయకుల్ని పోలీసులు అరెస్టుచేశారు. ‘రెస్ట్ ఇన్ పీస్’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి నివాళులు అర్పించేలా విశాఖలో ఏఐవైఎఫ్ అధ్యక్షుడు రాజేంద్రబాబు ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. విశాఖలోనే నిరుద్యోగ జేఏసీ నాయకుడు హేమంత్‌కుమార్ కదలికలపై బుధవారం రాత్రి నుంచే ఆంక్షలు విధించారు.
తూర్పుగోదావరిలో పికెట్లు జిల్లాలో చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటుచేసి సంఘాల నేతలు కాకినాడకు రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. 75 మందికి ముందస్తు నోటీసులు ఇచ్చారు. 22 మంది నాయకులను గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావుతో పాటు కొందరు నాయకులను కలెక్టరేట్ వెనుక ఉన్న ధర్నాచౌక్ వద్దకు అనుమతించారు.
ఒంగోలులో వాగ్వాదం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. సంఘాల నేతలు, కార్యకర్తల రాకను ముందే గుర్తించిన పోలీసులు ఉదయం 8గంటల నుంచే పెద్దసంఖ్యలో మోహరించి ఎక్కడికక్కడ అడ్డుకోగా వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.
చిత్తూరు జిల్లాలో రాత్రి అరెస్టులు బుధవారం రాత్రే చిత్తూరులో పలు సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్, మదనపల్లెలోని సబ్ కలెక్టరేట్‌కు వెళుతుండగా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు, ఇతర నేతలు బుధవారమే చిత్తూరుకు చేరుకున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట యువజన, విద్యార్థి నాయకులు పడుకొని నిరసన తెలిపారు.
గుంటూరులో మోకాళ్లపై కూర్చొని నిరసన గుంటూరు అంబేద్కర్ బొమ్మ వద్ద లాడ్జిసెంటర్‌లో నిరుద్యోగ, యువజన సంఘాల నేతలు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. శాంతియుత ధర్నాలు, ఆందోళనకు పోలీసులు అవకాశం లేకుండా చేస్తున్నారని, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఏపీˆ విద్యార్థి నిరుద్యోగ జేఏసీˆ నాయకుడు మహంకాళి సుబ్బారావు దుయ్యబట్టారు.
2.35 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీచేయరా? ‘అధికారంలోకి రాక ముందు ప్రతియేటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ దాని గురించి పట్టించుకోవట్లేదు. 2.35 లక్షల ఉద్యోగాల భర్తీ ఎందుకు చేయలేదు? గత ఏడాది కేవలం 10,143 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా గ్రూప్ 1 పోస్టులు 31, గ్రూప్ 2 పోస్టులు 5 మాత్రమే ఇచ్చారు. పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న 6,500 పోస్టుల భర్తీకి క్యాలెండర్ ప్రకటించకుండా 450 మాత్రమే భర్తీచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు నోటిఫికేషన్లు లేవు. ఉద్యోగవిరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచి నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టారు. తక్షణమే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలను భర్తీచేయాలి. లేనిపక్షంలో నిరుద్యోగుల సత్తా చూపుతాం. సీఎం డౌన్ డౌన్’ అంటూ టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగుయువత కార్యకర్తలు, విద్యార్థి సంఘాల వారు నినదించారు.
ర్యాలీగా వెళ్తుంటే ఈడ్చుకెళ్లారు
విజయనగరంలో కోట నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్తున్న వారిని నిర్బంధించి పోలీసులు ఈడ్చుకువెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది.
అనంతపురంలో నాయకులు బృందాలుగా ఏర్పడి కలెక్టరేట్ వైపు దూసుకురాగా పోలీసులు అరెస్టుచేశారు.
శ్రీకాకుళం కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థి, యువజన సంఘాలు ప్రయత్నించాయి. మార్గమధ్యంలో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటుచేశారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఉదయమే వివిధ సంఘాల నాయకులను అరెస్టుచేసి, పోలీసుస్టేషన్‌కు తరలించారు. కలెక్టరేట్ సమీపంలోని జిల్లా గ్రంథాలయాన్ని మూసేశారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరులో వివిధ సంఘాలు చేపట్టిన చలో కలెక్టరేట్‌ను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తెదేపా జిల్లా కార్యాలయం నుంచి తెలుగుయువత ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీగా బయలుదేరగా అడ్డుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాటలు చోటుచేసుకుని, పలువురికి గాయాలయ్యాయి.
చలో కలెక్టరేట్‌ను కడపలో పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ కార్యాలయ మార్గాలను ముళ్లకంచెలతో ఉదయం నుంచే దిగ్బంధించారు. నిరుద్యోగ, విద్యార్థి సంఘాల వారిని అదుపులోకి తీసుకుని వాహనాల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించారు.
హైదరాబాద్‌లోనూ ధర్నా
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని పలువురు నిరుద్యోగులు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ ధర్నాచౌక్‌లో ఏపీ నిరుద్యోగ పోరాటసమితి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ.. తల్లిదండ్రులను కష్టపెట్టి డబ్బులు తెప్పించుకుంటూ హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్నామన్నారు. గ్రూప్ 1, 2, ట్రాన్స్‌కో, జెన్‌కో, పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: నేడు నిరుద్యోగుల కలెక్టరేట్ల ముట్టడి.. పోలీసుల ముందస్తు అరెస్టులు