ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో అభివృద్ధి అంతంత మాత్రమే! - అనంతపురం తాజా వార్తలు

అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని గ్రామాల్లో రోడ్డు దుస్థితి అధ్వానంగా ఉంటే మరి కొన్ని గ్రామాల్లో నీటి సమస్య ఇప్పటికీ వెంటాడుతునే ఉంది. మరి అవేంటో...అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారో చూద్దాం.

ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో అభివృద్ధి అంతంత మాత్రమే!
ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో అభివృద్ధి అంతంత మాత్రమే!

By

Published : Feb 2, 2021, 1:01 PM IST

నాగిరెడ్డిపల్లిలో రహదారిపై మురుగు

రెండుసార్లు పదవి దక్కినా...
బ్రహ్మసముద్రం:రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి స్వగ్రామం కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలంలోని నాగిరెడ్డిపల్లి. ఆయన పుట్టి పెరిగింది ఇక్కడే. 5వ తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్నారు. అనంతరం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో స్థిరపడ్డారు. వారి వ్యవసాయ పొలాలు కూడా ఇక్కడే ఉన్నాయి. పలు కాలనీల్లో డ్రైనేజీలు లేక మురుగు రహదారులపై ప్రవహిస్తోంది. దాదాపు 20 ఏళ్ల కిందట గ్రామంలో ఆంజనేయస్వామి గుడి నిర్మాణానికి రామచంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. కానీ, ఇంత వరకు నిర్మాణం పూర్తి కాలేదు. రెండుసార్లు ఎమ్మెల్యే అయినా.. స్వగ్రామం అభివృద్ధికి చేసింది ఏమీ లేదని గ్రామస్థులు చెబుతున్నారు.

గ్రామంలో అధ్వాన రహదారి

ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ఠ
పుట్టపర్తి: పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి స్వగ్రామం తనకల్లు మండలంలోని పాతబత్తలపల్లి పంచాయతీలోని నరసింగయ్యగారిపల్లి. ఈ పంచాయతీ నేటికీ సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పాతబత్తలపల్లి పంచాయతీలో నరసింగయ్యగారిపల్లి, చండ్రాయునిపల్లి, తొలేటిపల్లి, ఆదిఆంధ్రాపల్లి, ఎనుములపల్లి గ్రామాలు ఉన్నాయి. జనాభా 3,712, ఓటర్లు 2,857 ఉన్నారు. 1995లో పంచాయతీ రెడ్డిపల్లి నుంచి విడదీసి నూతన పంచాయతీగా ఏర్పాటు చేశారు. పంచాయతీల పరిధిలోని గ్రామాలకు రహదారులు అధ్వానంగా మారాయి. పారిశుద్ధ్యం పడకేసింది. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు.

కొనకొండ్లలో కొళాయి నీటి కోసం గ్రామస్థుల నిరీక్షణ

తాగునీటి కోసం తిప్పలు
వజ్రకరూరు: గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యుడు వెంకట్రామిరెడ్డి సొంతూరు వజ్రకరూరు మండలం కొనకొండ్ల. గ్రామ జనాభా 14 వేలు ఉండగా ఓటర్లు 9200 మంది ఉన్నారు. గ్రామంలో కొన్నేళ్లుగా తాగునీటి సమస్య అధికంగా ఉంది. ఎత్తు ప్రాంతాల్లో నివాసముంటున్న కాలనీల ప్రజలు నీరు ఎక్కువగా వచ్చే కాలనీల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పైపులైన్లు వేసినా నీటి సరఫరా సక్రమంగా జరగక సమస్య అధికమైంది. 1, 2, 3 వార్డులతోపాటు ఐదో వార్డులో కూడా ఇదే పరిస్థితి. అక్రమ కొళాయి కనెక్షన్ల ప్రభావంతో ఐదో వార్డులో నీటి సమస్య ఉంది. ఎమ్మెల్యే స్వగ్రామ ప్రగతిపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.

ఏళ్లుగా తారురోడ్డుకు నోచుకోని హలుకూరు-కాచీకుంట రహదారి

కలగా మిగిలిన హంద్రీనీవా కాలువ
మడకశిర: మడకశిర ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి సొంత పంచాయతీ అమరాపురం మండలం హలుకూరు. ఈ పంచాయతీ పరిధిలోని ఉదుగూరు చెరువుకు హంద్రీనీవా కాలువ తవ్వించి అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. పంచాయతీలో ధీర్ఘకాలంగా పలు సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా హలుకూరు నుంచి కాచీకుంట గ్రామానికి ఉన్న మట్టి రోడ్డు పూర్తిగా గుంతలు పడింది. కొద్దిపాటి వర్షం వచ్చినా ద్విచక్ర వాహన చోదకులు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో అన్ని చెరువులకు హంద్రీనీవా కాలువలు ఉన్నాయి. అయితే ఉదుగూరు చెరువుకు ఏర్పాటు చేయలేదు. కృష్ణా జలాలు అందిస్తే తమ గ్రామ చెరువుకు నీరు రావని ప్రజలు చెబుతున్నారు. ఎమ్మెల్యే స్పందించి స్వగ్రామానికి కూడా కృష్ణా జలాలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

తిమ్మంపల్లి బస్టాండు ఆవరణం

ప్రగతి పథంలో తిమ్మంపల్లి
తాడిపత్రి, ధర్మవరం ఎమ్మెల్యేల స్వగ్రామం
యల్లనూరు: తాడిపత్రి, ధర్మవరం ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్వగ్రామం యల్లనూరు మండలంలోని తిమ్మంపల్లి. ధర్మవరం దివంగత ఎమ్మెల్యే కేతిరెడ్డి సూర్యప్రతాప్‌రెడ్డి సమయంలో ఫ్యాక్షనుకు పెట్టింది పేరు యల్లనూరు మండలం. కాలక్రమేణా ఫ్యాక్షనుకు దూరమై కేతిరెడ్డి పెద్దారెడ్డి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామం ఏకగ్రీవం కావడం ఇక్కడ ఆనవాయితీ. చింతకాయమంద పంచాయతీ కింద తిమ్మంపల్లి, కొడవండ్లపల్లి గ్రామాలు ఉన్నాయి. చింతకాయమంద పంచాయతీలో ఓటర్లు 3114, జనాభా 4369 మంది నివిస్తున్నారు. మండలంలో పెద్ద పంచాయతీగా గుర్తింపు ఉంది. గ్రామంలో సీసీరోడ్లు, రూ.కోట్ల నిధులతో ఆలయాలు, గ్రామంలో అతిపెద్ద హనుమాన్‌ విగ్రహం తదితర కార్యక్రమాలు చేపట్టారు. అయితే తిమ్మంపల్లి - చింతకాయమంద గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా ఉంది. రోడ్డును బాగు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.


పొలాలకు అందని సాగునీరు
ఆత్మకూరు: రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి స్వగ్రామం ఆత్మకూరు మండలం తోపుదుర్తి. గ్రామంలో దాదాపు 4 వేలకు పైగా జనాభా ఉన్నారు. 2 వేలకు పైగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామంలో మొత్తం 900 ఎకరాలకు పైగా భూములు సాగునీరు లేక బీడుగా మారిపోయాయి. వందల ఎకరాల భూములు ఉన్నా వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు కూలీలుగా మారిపోయారు. గ్రామంలో రెండు చెరువులు ఉన్నా పూర్తిస్థాయిలో అన్ని భూములకు నీరందించలేని పరిస్థితి. గ్రామ సమీపంలో రిజర్వాయర్‌ నిర్మించాలని గ్రామస్థులు చాలాకాలం నుంచి కోరుతున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టేందుకు ఎమ్మెల్యే ఉత్తర్వులు తీసుకువచ్చారు. అయితే పనులు ప్రారంభం కావాల్సి ఉంది.

నారాయణరెడ్డిపల్లి గ్రామం

ఓటు వేయాలంటే మరో గ్రామానికి..
పుట్లూరు: మండలంలోని నారాయణరెడ్డి గ్రామం పలువురు నాయకుల పుట్టినిల్లుగా పేరొందింది. ప్రస్తుత అనంతపురం ఎమ్మెల్యే స్వగ్రామం నారాయణరెడ్డి పల్లి. అనంత వెంకటరామిరెడ్డి 1994, 96, 2004, 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి అనంతపురం ఎంపీగా గెలుపొందారు. 2019లో వైకాపా నుంచి అనంతపురం శాసనసభ్యుడిగా విజయం సాధించారు. గ్రామంలో సుమారు 300 మంది ఓటర్లు ఉండగా పోలింగ్‌స్టేషన్‌ లేదు. ఓటు వేయాలంటే సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని మడ్డిపల్లి గ్రామానికి వెళ్లాల్సిందే. ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సోదనపల్లిలో అర్ధంతరంగా ఆగిన పాఠశాల భవనాలు

పదిహేనేళ్లుగా తరగతి గదుల్లేవ్‌..
శింగనమల: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సొంత పంచాయతీ సోదనపల్లిలో పదిహేనేళ్లుగా విద్యార్థులు తరగతి గదుల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఐదు తరగతులు, 75 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు.. గదులు మాత్రం రెండే. ఒకే గదిలో రెండేసి తరగతులు.. వరండాలో మరో తరగతిని నడిపిస్తున్నారు. ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల గదుల కొరత నెలకొంది. 2015లో నూతన తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. రెండు గదులు పూర్తయ్యాయి. విద్యార్థులు గదుల సమస్య తీరిందని ఆనందించారు. అంతలోనే భవనం అర్ధంతరంగా ఆగిపోయింది. అలాగే ఎస్సీ కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. మురుగు నీరు ఇళ్ల ముందు ప్రవహిస్తోంది. సీసీ రోడ్లు నిర్మించి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి

తెదేపా నేత పట్టాభిపై దాడి.. మోకాలు, చేతులకు గాయాలు.. కారు ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details