అనంతపురం జిల్లా భూములకు తుంగభద్ర జలాలు అనంతపురం జిల్లా తాగు, సాగు నీటి కష్టాలు తీర్చే తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ నిర్మాణానికి అడ్డంకులు వీడాయి. తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి వృథాగా దిగువకు పోయే వరద నీటిని కాలువ ద్వారా మళ్లించి అనంతపురం జిల్లాకు తీసుకురావాలని చాలాకాలం నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ప్రతిపాదనలను కర్ణాటక ప్రభుత్వం వ్యతిరేస్తూ వచ్చింది.
అయితే తుంగభద్ర జలాశయానికి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే బళ్లారికి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. అక్కడికి జలాశయం నుంచి నీరు తరలించాలంటే.. ఏపీ భూభాగం నుంచే తీసుకెళ్లాలి. దీంతో కర్ణాటక ప్రభుత్వం దారికొచ్చింది. బళ్లారికి నీటిని తరలించేందుకు ఏపీ భూభాగంలో కాల్వ తవ్వకానికి అంగీకరిస్తే.. అనంతపురం జిల్లాకు నీటిని తరలించే కాల్వ తవ్వకానికి తమ భూభాగంలో అనుమతిస్తామంటూ ప్రతిపాదన పంపింది. దీనికి ఏపీ ప్రభుత్వం అంగీకరించడంతో మార్గం సుగమమైంది.
కాల్వ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సర్వే నిర్వహించుకోవచ్చంటూ ఇటీవలే తుంగభద్ర జలాశయం బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో ఆమోదం తెలిపారు. దీంతో అనంతపురం అధికారులు సర్వే చేయటానికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి దస్త్రం పంపారు. ఈ సర్వే కోసం 6 కోట్ల 58 లక్షలు మంజూరు చేయాలని కోరారు.తుంగభద్ర జలాశయం అనంతపురం జిల్లాకు నీరు తరలించాలంటే కర్ణాటక భూభాగంలో 102 కిలోమీటర్లు, ఆంధ్రా భూభాగంలో 101 కిలోమీటర్ల చొప్పున 203 కిలో మీటర్ల మేర కాల్వ తవ్వాల్సి ఉంటుంది. 24 మీటర్ల వెడల్పు ఉండే ఈ కాలువ ద్వారా 12వేల క్యూసెక్కుల నీటిని ఏటా 25 రోజులపాటు తరలించవచ్చు. నవళి కాలువ నిర్మాణానికి కర్ణాటక వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సైతం సర్వేకు అనుమతించి నిధులు విడుదల చేస్తే...తక్షణం పనులు చేపట్టవచ్చని జలవనరులశాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి