అనంతపురం జిల్లాకు వరప్రసాదినిగా ఉన్న తుంగభద్ర జలాశయం నీటి ప్రవాహం లేక వెలవెలబోతోంది. వర్షాలు లేక.. ఎగువన కర్ణాటక రాష్ట్రం అక్రమంగా అధిక మొత్తంలో నీటిని వాడుకుంటున్నందున దిగువ ప్రాంతాల్లో నిల్వలు తగ్గిపోతున్నాయి. కర్ణాటకలో అన్నిచోట్ల నీటి నిల్వలు ఏర్పడిన తరువాతనే దిగువకు నీటిని వదులుతున్న పరిస్థితి యేటా నెలకొంటోంది. అయితే ఈసారి అటు కర్ణాటకతోపాటు.. ఆంధ్రప్రదేశ్లోని హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువల కింద తాగు, సాగు అవసరాలకు నీటిని పూర్తిగా విడుదల చేయాల్సి వచ్చింది. దీనివల్ల తుంగభద్ర డ్యాంలో కేవలం 1.80 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. డ్యాంలో కనిష్ఠ స్థాయిలో నీటి నిల్వ ఉందని, ఏ మాత్రం ప్రవాహాలు లేని పరిస్థితి ఈసారి మాత్రమే ఉందని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు.
అనంతపురం వరప్రసాదిని.. అడుగంటింది - thungabadra
అనంతపురం జిల్లా తాగు,సాగునీటి అవసరాలు తీర్చే తుంగభద్ర జలాశయం అడుగంటింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కేవలం ఒకటిన్నర టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండటం అన్నదాతల్లో ఆందోళన కలిగిస్తోంది.
తుంగభద్ర జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 132 టీఎంసీలు కాగా.. పూడిక కారణంగా కేవలం 100 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలుగుతున్నారు. ఈసారి సీజన్లో అంచనాల ప్రకారం అనంతపురం జిల్లా హెచ్ఎల్సీ కాలువకు 25 టీఎంసీల నీటిని ఇస్తున్నట్లుగా తాజాగా నిర్వహించిన టీబీ డ్యాం బోర్డు సమావేశంలో నిర్ణయించారు. టీబీ డ్యాంకు ఎగువన ఉన్న తుంగ నదీ పరీవాహక ప్రాంతంలో కొద్దిపాటి వర్షాలు కురిసి శివమొగ సమీపంలోని తుంగ డ్యాంలో గరిష్ఠ స్థాయిలో 3.5 టీఎంసీల నీటి నిల్వ వచ్చింది. అక్కడి నుంచి కొన్ని రోజుల క్రితం 30 వేల క్యూసెక్కుల నీటని దిగువకు వదిలినప్పటికీ, ప్రవాహం ఎక్కడికక్కడ నీరు ఇంకిపోయి హోస్పేట్లోని తుంగభద్ర డ్యాం వరకు రాలేదు. వాతావరణశాఖ అంచనాల మేరకు మున్ముందు వర్షాలు కురుస్తాయని కలెక్టర్ చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా పీఏబీఆర్, ఎంపీఆర్ జలాశయాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నందున తుంగభద్ర జలాశయంలో నీటిచేరికపై సర్వత్రా ఆందోళన నెలకొంది.