Train Stopped in Imampuram After Three Years: పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఇమాంపురం గ్రామస్థులు నిరూపించారు. ఎలాంటి రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామమైన ఇమాంపురం మీదుగా రోజూ అనేక రైళ్లు తిరుగుతున్నా.. ఊర్లో ఆగేవి కాదు. చాలాసార్లు అభ్యర్థనలు ఇచ్చినా అధికారులు స్పందించలేదు. చివరకు సొంత ఖర్చుతో రైల్వే స్టేషన్ నిర్మించుకుంటే రైలు నిలుపుతామని అధికారులు గ్రామస్థులకు చెప్పారు. ఊరంతా చందాలేసుకొని 2017లో ఇమాంపురంలో రైల్వే స్టేషన్ నిర్మించుకున్నారు. అధికారులు రెండేళ్ల పాటు స్టేషన్‌లో రైళ్లు నిలిపారు.
కరోనా లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా రైళ్లను రద్దుచేసిన సమయంలో ఇమాంపురం మీదుగా వెళ్లే రైళ్లు కూడా రద్దయ్యాయి. కరోనా తర్వాత అన్నిచోట్ల రైళ్లను పునరుద్ధరించినా ఇమాంపురంలో మాత్రం హాల్ట్ ఇవ్వలేదు. దీంతో గ్రామస్థులు దాదాపు మూడేళ్లుగా రైలు హాల్ట్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇమాంపురం గ్రామ ప్రజల సమస్యపై జులైలో.. ఈటీవీ, ఈటీవీ భారత్లో కథనం వచ్చింది. ఈ సమస్యను ఎంపీ తలారి రంగయ్య, రైల్వే డీఆర్ఎంల దృష్టికి తీసుకెళ్లగా.. వారు స్పందించారు. గ్రామస్తుల కోరిక నెరవేరింది.