graduates and teachers MLC elections: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే రూ.3 నుంచి రూ.5 వేల రూపాయలు వస్తాయని.. దొంగ ఓట్లను సృష్టిస్తున్నారు. నేపథ్యంలో.. ఓటు విలువను తెలియజేస్తూ.. ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ ఆసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ వినుత్న ప్రయత్నం చేశారు. ఓట్లను అమ్ముకోనని వెల్లడిస్తూ తన ఇంటి ముందు ఫ్లెక్సీ పెట్టారు. తాను, తన కుటుంబం తమ ఓట్లను అమ్ముకోమని చెబుతూ.. ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తాము చదువుకున్నామని, తమకు వచ్చే జీతం సరిపోతుందని తెలియజేస్తూ.. ఆ బ్యానర్ ద్వారా తమ ఇంటికి ఓట్ల కోసం వచ్చే వారికి పరోక్షంగా తాను అమ్ముడు పోయే వాడిని కాదంటూ తెలియజేస్తున్నారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఓ ఆసక్తికరమైన ఫ్లెక్సీ ఏర్పాటైంది. ఈ ఫ్లెక్సీ స్థానికంగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీసస్ నగర్ లోని డోర్ నెంబర్ 12-3-681 ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ ఆసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు. 'మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు' అని తన ఇంటి గేటుకు ఫ్లెక్సీని కట్టించారు. ఓటు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, అది వజ్ర యుధం వంటిదని, దాన్ని అమ్ముకుని ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును పొగోట్టుకోలేమని అందులో రాయించాడు. ఓటు విలువను వివరిస్తూ మాస్టారు ఏర్పాటు చేయించిన ప్లెక్సీ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఫ్లెక్సీ గురించి అడిగితే.. డబ్బులు తీసుకుని ఓటు వేస్తే రాజ్యాంగాన్ని అగౌరవ పరిచినట్లే అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు జోరుగా సాగుతున్న సమయంలో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు కావడం గమనార్హం.