TDP LEADERS REACTS ON ANANTAPUR INCIDENT : అనంతపురంలో వ్యవసాయ కూలీలపై విద్యుత్ తీగలు తెగిపడి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందిన ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమన్నారు. విద్యుత్ తీగలు తెగిపడటం.. వారం రోజుల్లో ఇది రెండోసారని.. కొన్ని రోజుల క్రితం ఈ తరహా ప్రమాదంలో ఐదుగురు చనిపోయారన్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. విద్యుత్ శాఖ పర్యవేక్షణ కరువయ్యిందని ధ్వజమెత్తారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ఈ ప్రభుత్వానికి పట్టదా అని నిలదీశారు. ప్రమాద ఘటనలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రమాదాలు జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది: రాష్ట్రంలో వరుసగా విద్యుత్ తీగలు ఎందుకు తెగిపడుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం.. ప్రజల పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ తీగలు తెగిపడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని మండిపడ్డారు. అనంతపురంలో విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు చనిపోవడం, పలువురు పరిస్థితి విషమంగా ఉండటం బాధాకరమన్నారు. ప్రమాదం జరిగిన ప్రతిసారీ ఉడత కథ చెప్పి తప్పించుకోవడం, దేవుడి ఖాతాలో వేసి చేతులు దులుపుకోవడం జగన్ సర్కార్‌కి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. చనిపోయిన కూలీల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలన్నారు.