PARITALA SRIRAM FIRES ON YCP MLA KETHIREDDY : ధర్మవరంలో ఎర్రగుట్ట భూమిని ఆక్రమించి, గుట్టమీద గుర్రాల కోట కట్టి.. కట్టుకథలతో ప్రజలను మోసం చేయోద్దంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డిపై చేసిన ఆరోపణలను పరిటాల శ్రీరామ్ రెండు రోజుల క్రితం ఆధారాలతో సహా నిరూపించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మరోసారి సోషల్ మీడియాలో భూమి సంబంధించిన చిత్రాలను విడుదల చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి విడుదల చేసిన చిత్రాలపై మరోసారి మీడియా ముందుకు వచ్చిన పరిటాల శ్రీరామ్.. కంప్యూటర్లో చాలా ఇబ్బంది పడి భూమి చిత్రాలను విడుదల చేశారంటూ ఎద్దేవా చేశారు.
ఆక్రమణ లేకపోతే, ప్రత్యక్షప్రసారం ద్వారా భూమిని సర్వే చేయించి ఆక్రమణ లేదని నిరూపించుకోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డికి పరిటాల శ్రీరామ్ సవాల్ విసిరారు. తన పేరు చెప్పి కబ్జాలు చేసే వారిని చెప్పుతో కొట్టాలని చెబుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి, ఆయన పక్కనే ఉండి అక్రమాలు చేస్తున్న వారిని ఎవరు చెప్పుతో కొట్టాలో ఆయనే చెప్పాలన్నారు. సామాన్య రైతులు భూమిని ఆక్రమిస్తే నిబంధనలు చూపుతున్న అధికారులు, కొండను ఆక్రమించిన ఎమ్మెల్యేను పట్టించుకోరా అంటూ శ్రీరామ్ ప్రశ్నించారు.