ప్రజల ప్రాణాలను కబళిస్తున్న కరోనా వైరస్ ను నియంత్రించడంలో.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. కోవిడ్ బాధితులకు కనీస సదుపాయాలు కల్పించడంలో ఆసుపత్రుల తీరు సరిగా లేదన్నారు. రాష్ట్రంలో మహమ్మారి బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా.. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలతో కాలం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆసుపత్రుల్లో బాధితులకు అవసరమైన సదుపాయాలను కల్పించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రజలకు భరోసా కల్పించేలా వైద్యశాల్లో సదుపాయాలను మెరుగుపరచాలి డిమాండ్ చేశారు. కదిరి ప్రాంతీయ వైద్యశాలలో ఐసీయూ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి.. రోగులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ తీరు మారని పక్షంలో ప్రజలతో కలిసి రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.