అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథాన్ని లాగేందుకు ఉపయోగించే మోకుల తయారీకి.. ఎస్బీఐ తరపున రూ. 5 లక్షల విరాళాన్ని బ్యాంకు అధికారులు ఆలయానికి సమర్పించారు. ఈ మొత్తాన్ని రాయలసీమ జోన్లలోని ఎస్బీఐ అధికారులు.. ఆలయ ఈవో వెంకటేశ్వర్ రెడ్డి, పాలకమండలి చైర్మన్, సభ్యులకు అందజేశారు.
దక్షిణ భారతదేశంలోనే భక్తులు లాగే అతిపెద్ద రథాల్లో కదిరి లక్ష్మీ నరసింహ స్వామి రథాన్ని.. ఒక్కటిగా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం మార్చిలో నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శ్రీదేవి భూదేవి సమేత నరసింహుడు బ్రహ్మరథంపై తిరువీధుల్లో విహరిస్తారు. స్వామివారు ఆసీనులైన రథాన్ని జయజయధ్వానాలతో భక్తులు మోకులతో లాగుతారు.