ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పారిశుద్థ్య కార్మికులు యత్నం sanitation workers Agitation: అనంతపురం నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికులు కన్నెర్ర చేశారు. మున్సిపల్ కార్యాలయం నుంచి కార్మికులు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంటి వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటి ఎదుట బైఠాయించి తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేస్తూ.. ఇంటి ముట్టడికి యత్నించారు. జగన్ మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో కార్మికులు ఆందోళనకు చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందని కార్మిక సంఘం నేతలు ఆరోపించారు. వేతనాలు సకాలంలో ఇవ్వటంలేదని.. మూడు నెలల వేతనాల బకాయిలు వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే ఇంటి ఎదుట బైఠాయించి నినాదాలు..దీర్ఘకాలంగా సమస్యలను ఏకరవు పెడుతున్నా అధికారులు, ఎమ్మెల్యే పట్టించుకోవటంలేదని కార్మికులు ఆరోపించారు. సమస్యల పరిష్కారంలో విఫలం కావటంతో ఉదయాన్నే కార్మికులంతా ఏకమై అనంత నగరంలో ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంటిని ముట్టడించే యత్నం చేశారు. దాదాపు రెండు వందల మంది కార్మికులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. చాలాసార్లు సమస్యలు మీ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదని కార్మికులు వెంకటరామిరెడ్డిని ప్రశ్నించారు.
సీఎం జగన్ మాటతప్పారు..పారిశుధ్య కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించటంలేదని ఎమ్మెల్యేను కార్మిక సంఘం నేతలు నిలదీశారు. ఐదు నెలల వేతనం బకాయి ఉండగా, కేవలం రెండు నెలలది మాత్రమే చెల్లించారన్నారు. నెలల తరబడి వేతనాలు రాకపోతే పారిశుధ్య కార్మికుల కుటుంబాల పోషణ ఎలా అంటూ ప్రశ్నించారు. కార్మికులకు హెల్త్ అలవెన్సులు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి, సీఎం అయ్యాక పట్టించుకోవటంలేదని ఆరోపించారు. పాదయాత్ర సందర్భంగా పారిశుధ్య కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా మారుస్తామని చెప్పిన సీఎం జగన్ మాటతప్పారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ..ఇంటి ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులను ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఇంటి ఆవరణలోకి చర్చలకు ఆహ్వానించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తనని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తక్షణమే తమ వేతన బకాయిలు విడుదల చేసి, క్రమం తప్పకుండా ప్రతినెలా వేతనాలు చెల్లించకపోతే సమ్మెబాట పట్టి, ఉద్యమం తీవ్రతరం చేస్తామని పారిశుధ్య కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వచ్చే 8వ తేదీన ముఖ్యమంత్రి జగన్ కళ్యాణదుర్గం వస్తున్నారు. అలవెన్సులు రావట్లేదని మా దృష్టికి తీసుకు వచ్చారు. మేము 8వ తేదీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తాం. కార్మికుల కుంటుంబాలు అందరికి ఈ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయో.. వారందరికీ ఇతరుల మాదిరి అందాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి చెప్పారు. - అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే