ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆధార్ నమోదులో అధికారుల తప్పిదం.. నిరుపేదకు తప్పని కష్టం!

దేశంలో ఏ సంక్షేమ పథకం నుంచి లబ్ధి పొందాలన్నా ఆధార్ తప్పని సరి. ప్రతి నెల ఇచ్చే రేషన్ మెుదలు.. ఉపాధి హామీ పనికి వెళ్లాలన్నా ఆధార్ నెంబర్ ఆధారంగానే ప్రయోజనం ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఆధార్ నెంబర్ కేటాయింపులో అధికారుల తప్పిదం.. ఓ నిరుపేద కుటుంబానికి శాపంగా మారింది. కుటుంబంలోని ఇద్దరికీ ఒకే ఆధార్ నెంబర్ కేటాయించిన కారణంగా వారు సంక్షేమ పథకాలకు దూరం కావాల్సి వచ్చింది.

Same Aadhaar number for both in anantapuram
ఆధార్ నమోదులో అధికారుల తప్పిదం

By

Published : Apr 15, 2021, 7:24 PM IST

ఆధార్ నమోదులో అధికారుల తప్పిదం.. ఓ నిరుపేద కుటుంబం పట్ల శాపంగా మారింది. కుటుంబంలోని ఇద్దరికీ ఒకే నెంబర్ కేటాయించటంతో ప్రభుత్వం నుంచి అందాల్సిన లబ్ధికి దూరమయ్యారు. ఆధార్ మార్పు కోసం గత పదేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరిగినా.. ఫలితం లేకుండా పోయింది.

అనంతపురం జిల్లా సీకేపల్లి మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన సుబ్బమ్మ, ఆమె కూతురు జయమ్మ తల్లీ కూతుళ్లు. 2011లో గ్రామంలోనే వేలిముద్రలు, కనుపాపల ద్వారా వీరు ఆధార్ కార్డులు పొందారు. ఆధార్ కేటాయింపులో ఎక్కడ పొరపాటు జరగిందో తెలీదు కానీ..తల్లీ కూతుళ్ల పేర్లు, వయస్సు అన్నీ సక్రమంగానే ఉన్నా..ఇద్దరికీ ఒకే గుర్తింపు సంఖ్యను కేటాయించారు. ఇక అప్పటి నుంచి ఆ కుంటుంబానికి కష్టాలు మెుదలయ్యాయి.

అధికారులు చేసిన తప్పిదానికి తల్లీ సుబ్బమ్మకు రేషన్, పింఛన్ అందుతున్నా.. జయమ్మ మాత్రం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేక పోతుంది. రేషన్ మొదలు.. ఉపాధి కూలీగా కూడా అర్హత లేకుండా పోయింది. ఈ విషయం తెలియని జయమ్మ ఓ సీజన్ మెుత్తం ఉపాధి హామీ పనులకు వెళ్లగా.. ఆమె ఖాతాలో డబ్బు జమ కాలేదు. ఉపాధి కూలీ నిమిత్తం డ్వామా సిబ్బందిని సంప్రదించగా.. ఆధార్​ నమోదులో జరిగిన పొరపాటు కారణంగా డబ్బు జమ కాలేదని తేల్చి చెప్పారు.

ఆధార్ గుర్తింపు సంఖ్యను సరిచేసి న్యాయం చేయాలంటూ జయమ్మ వెళ్లని ఆఫీసు లేదు. కలవని అధికారి లేరు. మండల తహసీల్దార్ మెుదలు.. జిల్లా కలెక్టర్ వరకు పదుల సంఖ్యలో వారిని కలిసి విన్నవించుకున్నా తన సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. చివరకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని కలవగా... జయమ్మకు న్యాయం చేయాల్సిందిగా తహసీల్దార్​ను ఆదేశించారు. అయినా ఇప్పటి వరకు ఆమె సమస్యకు పరిష్కారం లభించలేదు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కారించాలని తల్లీ, కూతుళ్లు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని చంపేశాడు

ABOUT THE AUTHOR

...view details