అనంతపురం జిల్లాలో రెవెన్యూ అధికారుల నిర్వాకం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ నిర్మాణంలో ఆలస్యానికి కారణమైంది. 2016లో గోరుచిక్కుడు జిగురు పరిశ్రమ ఏర్పాటు బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు అప్పగించిన అప్పటి ప్రభుత్వం అందుకు 11 కోట్ల రూపాయలు కేటాయించింది. కనగానపల్లి మండలం దాదులూరులోని 498-1B సర్వే నంబర్‌లో ఐదెకరాల భూమిని కేటాయిస్తూ ఏపీఐసీసీ ఉత్తర్వులిచ్చింది. రెవెన్యూ అధికారులు, సర్వేయర్ కొలతలు వేసి 2017లో భూమిని మార్క్‌ఫెడ్‌కు అప్పగించారు. ఆ భూమిలో భవన నిర్మాణం చేపట్టిన సంస్థ 95 శాతం పనులూ పూర్తిచేసింది. అయితే... భవనం నిర్మించిన స్థలం 498-1Bలో కాకుండా 508 సర్వేనంబర్‌లో ఉందని గుర్తించిన ఏపీఐసీసీ అధికారులు పనులను ఆపేశారు. మండల సర్వేయర్ తప్పిదమే వివాదానికి కారణమని చెబుతున్నారు
దాదులూరు వద్ద గోరుచిక్కుడు పరిశ్రమకు ఆది నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. జిల్లాలో వర్షపాతం పెరగడంతో గోరుచిక్కుడు సాగు లాభదాయకం కాదని భావించిన అధికారులు దాని స్థానంలో చిరుధాన్య ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయించారు. పనులు వేగవంతంగా సాగుతున్న తరుణంలో తలెత్తిన సమస్యలు మరోసారి అడ్డుగా నిలిచాయి. కేటాయించిన భూమిలో కాకుండా 508 సర్వే నంబర్‌లో 75 శాతం నిర్మాణం జరిగినట్లు తేలింది. దీనిపై ఏపీఐఐసీ, మార్క్‌ఫెడ్ సంస్థల మధ్య వాదోపవాదాలు జరిగాయి. భూములు పరిశీలించిన సంయుక్త కలెక్టర్ మధ్యేమార్గం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. ఆ మేరకు నడుచుకుంటామని మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు.