ఏటా కరవుతో పంట నష్టపోయే అనంత రైతులకు.. ఈసారి భారీ వర్షాలు శోకాన్ని మిగిల్చాయి. చినుకు కోసం తపించే అనంతపురం జిల్లా రైతుల పంటలను భారీ వర్షాలు తుడిచిపెట్టాయి. ఖరీఫ్ పంటలన్నీ నష్టాలను మిగిల్చగా.. చివరగా చేతికొచ్చే కందిపై అశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగిలింది. పెట్టబడులు కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది కంది పంట విస్తీర్ణం తక్కువగా ఉన్న కారణంగా... మంచి ధర పలుకుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా పంటపై చీడ, పీడలు దాడి చేశాయి. మందులు పిచికారీ చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఉన్న కొంత పిందెలు, పూత నవంబర్ తొలి వారంలో కురిసిన వర్షాలకు రాలిపోయాయి. పంట నూర్పిడి చేయిస్తే కోత ఖర్చులు రావని అలాగే వదిలేసినట్లు రైతులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల రైతులు వచ్చినవరకైనా నూర్పిడి చేసుకోవాలని, కుటుంబ సభ్యులే పంటను కోసి, పూర్వపు పద్థతిలో ఖర్చు లేకుండా కందులు రాల్చుకుంటున్నారు.