Special article on Diesel Mafia : రాష్ట్రంలో డీజిల్ విక్రయించే రిటైల్ బంకుల డీలర్లకు లీటర్‌పై వచ్చే కమిషన్ దాదాపు 2రూపాయల 15పైసలు. కానీ రిటైల్ డీజిల్ ధరకంటే ఆర్టీసీకి లీటర్ 3రూపాయల 30పైసలు తక్కువగా విక్రయిస్తున్నారు. ఇదేంటి అనంతపురం జిల్లా డీజిల్ బంకుల యజమానులు నష్టానికి డీజిల్ వ్యాపారం చేస్తున్నారని అనుకుంటున్నారా.. ఇక్కడే అసలు మతలబు ఉంది. కర్ణాటకలో లీటరు డీజిల్‌పై 10 రూపాయల నుంచి 11రూపాయల 50పైసల వరకు ధర తక్కువగా ఉంది. పొరుగు రాష్ట్రంలో ధర తక్కువగా ఉండటం, డీజిల్ మాఫియాకు కలిసి వస్తోంది.
డీజిల్ మాఫియాకు ఆర్టీసీలో ఓ అధికారి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డీజిల్ కొనుగోలు విధానంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు మార్పులు చేయటంతో అనంతపురం ఆర్టీసీ అధికారులకు కాసులు కురిపిస్తోంది. కర్ణాటక రాష్ట్రం నుంచి జిల్లాకు వస్తున్న అక్రమ డీజల్‌తో ఆర్టీసీ అధికారులు, అక్రమార్కుల ద్వారా ప్రతినెలా రాష్ట్రానికి ఐదు కోట్ల రూపాయల మేర వ్యాట్ పన్ను గండికొడుతున్నారు. ఈ మధ్యకాలంలో పెనుకొండ, కళ్యాణదుర్గం, తాజాగా అనంతపురం బస్ డిపోల వద్ద పట్టుకున్న కర్ణాటక డీజిల్ వ్యవహారం అనంతపురం జిల్లాలో పెద్దఎత్తున డీజిల్ మాఫియాను మరోసారి వెలుగులోకి తెచ్చింది.