అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని అమ్మవారిపల్లి వద్ద అమ్ముప్రియా ట్రావెల్స్ పేరుతో దాదాపు 150 మందిని మోసగించి రూ.కోట్లతో పరారైన ట్రావెల్స్ యజమాని గుడిబండ మండలానికి చెందిన వెంకటేశ్, బెంగళూరుకు చెందిన మహేంద్రబాబు, అంజినప్పను అరెస్టు చేసినట్లు పెనుకొండ డీఎస్పీ రమ్య తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను శనివారం ఆమె విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
అమ్ముప్రియా ట్రావెల్స్ పేరుతో చీటింగ్... ముగ్గురు అరెస్ట్ - Ammupriya Travels cheating
అనంతపురం జిల్లాలో అమ్ముప్రియా ట్రావెల్స్ చీటింగ్ కేసులో ముగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.5.25 లక్షల నగదు, 70 గ్రాముల బంగారం, 22 గ్రాముల వెండి, మూడు చరవాణులు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ట్రావెల్స్ పేరుతో పలువురిని మోసగించి సుమారు రూ.1.20 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైందన్నారు.
2021 జనవరిలో నిందితులు ముగ్గురు కలసి అమ్మవారిపల్లి వద్ద అమ్ముప్రియా ట్రావెల్స్ ఏర్పాటు చేశారు. కియా కారును మార్కెట్ ధర కంటే రూ.1.5లక్షలు తక్కువకే ఇప్పిస్తామని, ప్రజల నుంచి వాహనాలను అద్దెకు తీసుకొంటామని వారితోనే అడ్వాన్సుగా రూ.15 వేలు కట్టించుకొని మోసగించారు. ఈ ఘటనలో దాదాపు రూ.1.20 కోట్లు మోసగించారు. మోసపోయిన 45 మంది బాధితులు కియా ఇండస్ట్రీయల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు... నిందితులను అరెస్టు చేసి రూ.5.25 లక్షల నగదు, 70 గ్రాముల బంగారం, 22 గ్రాముల వెండి, మూడు చరవాణులు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. కొంత మంది బాధితులకు నగదు, వాహనాలు అప్పగించామని వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచినట్లు తెలిపారు. సమావేశంలో పెనుకొండ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి