సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించే స్థాయిలో ఉద్యోగ సంఘాలు ఉండటాన్ని తానెప్పుడూ చూడలేదని అనంతపురంలో నిర్వహించిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు డా. శైలజనాథ్ అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చినా తాము ఎన్నికలకు పనిచేసేది లేదంటూ.. ఉద్యోగ సంఘాల నేతలు చెప్పటాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రజాదరణ పెద్దఎత్తున ఉందని భావిస్తున్న ప్రభుత్వం.. ఎన్నికలను ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. జడ్బీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లలో అరాచకాలు జరిగాయని తెలిసినప్పటికీ.. ఎస్ఈసీ వీటిని రద్దు చేసి, ఎందుకు కొత్తగా నోటిఫికేషన్ను ఇవ్వడం లేదని శైలజనాథ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాము అనేకసార్లు ప్రస్తావించినప్పటికీ.. ఎస్ఈసీని ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతుందో తెలియడం లేదన్నారు.
అన్ని పార్టీలతో ఎన్నికల సంఘం చర్చించి నిర్ణయం తీసుకునుంటే బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఎస్ఈసీతో కలిసి పనిచేసి.. ఎన్నికలను సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.