ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ పీఠంపై అతివలు... గ్రామాభివృద్ధికే ప్రాధాన్యం - అనంతపురం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు

అన్నింటా కాదు.. అధికారంలోనూ సగం అంటున్నారు అతివలు. పిల్లల లాలనలోనే కాక.. పల్లెల పాలనలోనూ ముందుంటున్నారు. పొట్ట నింపడమే కాదు.. పట్టు నిలుపుకోవడమూ తెలుసని నిరూపిస్తున్నారు. రిజర్వేషన్లు ఎలా ఉన్నా ఆయా పంచాయతీల ఓటర్లు మహిళలకే పట్టం కడుతున్నారు. పల్లె పాలనలో పురుషులకు ఏమాత్రం తీసిపోమని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు మగువలు. గ్రామాల అభివృద్ధి బాధ్యతగా.. ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా అడుగులు వేశారు. జిల్లాలో ఏకంగా రెండు పర్యాయాలకు మించి గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నికై పాలనలో తమదైన ముద్ర వేసిన మహిళామణులపై ప్రత్యేక కథనం.

పంచాయతీ పీఠంపై అతివలు...గ్రామాభివృద్ధికే ప్రాధాన్యం
పంచాయతీ పీఠంపై అతివలు...గ్రామాభివృద్ధికే ప్రాధాన్యం

By

Published : Feb 1, 2021, 12:40 PM IST

కణేకల్లు గ్రామం విహంగ వీక్షణం

మేజర్‌ పీఠం మహిళలకే...

నాగమణి, మాజీ సర్పంచి, శింగనమల

కణేకల్లు మేజరు పంచాయతీలో గత పదేళ్లుగా మహిళలు సర్పంచులుగా ఎన్నికవుతున్నారు. మేజరు పీఠం ప్రస్తుతం ఎస్సీ మహిళకు రిజర్వేషన్‌ అయింది. దీంతో మళ్లీ సర్పంచి పదవి మహిళలనే వరించనుంది. 2006లో మేజరు పంచాయతీని జనరల్‌ మహిళకు కేటాయించారు. జయమ్మ సర్పంచిగా ఎన్నికై 2011 వరకు కొనసాగారు. 2013లో బీసీ మహిళకు కేటాయించడంతో కౌసల్య సర్పంచిగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ పంచాయతీ అభివృద్ధికి కృషి చేశారు. వరుసగా మూడోసారి మహిళకే రిజర్వేషన్‌ కావడంతో ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. కణేకల్లు పంచాయతీలో 16,352 మంది ఓటర్లు ఉండగా, 7,973 మంది పురుషులు, 8,379 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 402 మంది మహిళల ఓట్లు అధికంగా ఉండటంతో అభ్యర్థుల గెలుపునకు మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. ఈ సారి వైకాపా, తెదేపా మద్దతుదారుల నడుమ తీవ్ర పోటీ జరుగనుంది. సర్పంచి పీఠం ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నాలుగోసారి నారీమణులే

విజయలక్ష్మి, మాజీ సర్పంచి

శింగనమలలో నాలుగో సారి నారీమణులే సర్పంచిగా పాలన చేయనున్నారు. గత మూడు పర్యాయాలు మహిళలే ఇక్కడ సర్పంచిగా కొనసాగారు. ప్రస్తుత రిజర్వేషన్లలో మహిళలకే అవకాశం కల్పించారు. 2001లో కడియాల నాగమణి, 2006లో విజయలక్ష్మి, 2013లో ముంత రమాదేవి సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు సర్పంచులు గ్రామాభివృద్ధికి ఎంతో సహకారం అందించారు. సీసీ రోడ్ల నిర్మాణాలు, పాఠశాల భవనాలు, నూతన డ్రైనేజీ వ్యవస్థను, తాగునీటి సమస్య పరిష్కారం వంటి అనేక ప్రజా సమస్యలను ఈ మహిళ మణులే తీర్చారు. వరుసగా ముగ్గురు సర్పంచులు పాలన చేయగా నాలుగోసారి మహిళకే అవకాశం వచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు.

మూడోసారి పోటీకి సై

లక్ష్మీనారాయణమ్మ

గుత్తి మండలంలోని జక్కలచెరువు, కొజ్జేపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలు పంచాయతీ ఎన్నికల్లో పట్టు వీడటం లేదు. పాలనలో తమకంటూ ప్రత్యేకతను చూపుతున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా వారిదే ఆధిపత్యం కొనసాగుతోంది. జక్కలచెరువుకు చెందిన లక్ష్మీనారాయణమ్మ 2008, 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసి సర్పంచిగా ఎన్నికయ్యారు. ఆమె చిన్నాన్న చిన్నరామన్న ఆరేళ్లు సర్పంచిగా కొనసాగారు. అంతకు ముందు ఆమె మామ నారాయణస్వామి మూడు సార్లు ఏకగ్రీవంగా స్పర్పంచిగా ఎన్నికయ్యారు. చిన్నాన్న, మామ వారసత్వంగా లక్ష్మీనారాయణమ్మ రాజకీయాల్లోకి వచ్చారు. తెదేపా మద్దతుతో రెండు సార్లు సర్పంచిగా గెలిచారు. గ్రామంలో సిమెంట్‌రోడ్లు, తాగునీటి పథకాలు, పక్కా ఇళ్లు నిర్మించారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

పదేళ్ల పదవీ కాలంలో..

నాగమణి

కొజ్జేపల్లి సర్పంచిగా నాగమణి 1995, 2006లో రెండుసార్లు సర్పంచిగా ఎన్నికయ్యారు. పదేళ్ల పదవీ కాలంలో రూ.1.50 కోట్లతో ప్రగతి పనులు చేశారు. గ్రామాభివృద్ధికి పరితపించారు. భర్త మల్లయ్యయాదవ్‌ ఆమెను రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయం చేస్తూనే ప్రజా సేవ చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మూడోసారి పోటీకి సిద్ధమయ్యారు. ఈసారి ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రెండుసార్లు ఏకగ్రీవం

యాడికి మండలం చిక్కేపల్లి పంచాయతీలో 2001 నుంచి 2018 వరకు మహిళలే ప్రాతినిథ్యం వహించారు. ఈ పంచాయతీకి ఒకే గ్రామ ఓటర్లు ఉన్నారు. వారు ఇద్దరు మహిళా సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన మరో మహిళకు సైతం పట్టం కట్టారు. 2001లో లక్ష్మిదేవి, 2006లో దస్తగిరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2013లో ఉమామహేశ్వరి బరిలో నిలిచి నెగ్గారు. 839 ఓటర్లున్న ఈ ఏక గ్రామ పంచాయతీలో 416 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 340 వరకు వ్యవసాయ ఆధారిత కుటుంబాలున్న ఈ గ్రామంలో మహిళా సర్పంచులు సీసీ రోడ్లను గ్రామమంతా పరిచారు. వంద శాతం పారిశుద్ధ్యం, ఇంటింటికి కొళాయి వంటి సమస్యల పరిష్కారం కోసం స్థానికులు ఇంకా వేచి చూస్తున్నారు.

ఇదీ చదవండి:

అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ

ABOUT THE AUTHOR

...view details