మంత్రి పదవి కోసం జిల్లా నుంచి పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే వెనుకబడిన సామాజికవర్గం కోటాలో శంకర్ నారాయణకు తప్పకుండా అవకాశం ఉంటుందనే ప్రచారం ముందు నుంచీ సాగింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఛాన్స్ వచ్చింది. కుటుంబ సమేతంగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. శంకర నారాయణ ప్రమాణంతో పెనుకొండలోని ఆయన మద్దతుదారులు, పార్టీ కార్యాకర్తలు సంబరాలు చేసుకున్నారు.
మొదటి నుంచి విధేయుడిగా...శంకర్‌నారాయణ స్వస్థలం ధర్మవరం. ఆయన న్యాయవాద వృత్తిలో కొనసాగారు. తొలుత 1994 నుంచి తెదేపా జిల్లా కమిటీ సభ్యుడిగా, ధర్మవరం నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా ఉన్నారు. 2005 ధర్మవరం మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందారు. తర్వాత తెదేపాలో సరైన గుర్తింపు లేకపోవడంతో.. 2011లో వైకాపా ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2012లో ఆయనకు జిల్లా కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి కొద్ది నెలల కిందట వరకు ఆయనే జిల్లా కన్వీనర్ బాధ్యతలు చూశారు. పార్టీ కార్యక్రమాలు విరివిగా నిర్వహించారు. అలాగే జిల్లా కన్వీనర్ హోదాలో ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడ సమస్యలు వచ్చినా అక్కడి నాయకులతో కలిసి పోరాటం చేశారు. 2014 ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీచేసి 17 వేల ఓట్లకుపైగా తేడాతో బీకే పార్థసారథి చేతిలో ఓటమిపాలయ్యారు. ఓటమి తర్వాత నియోజకవర్గాన్ని వదిలేయకుండా అక్కడే ఉంటూ పార్టీని బలోపేతం చేసే యత్నం చేశారు. నియోజకవర్గ కేంద్రంలో ఓ ఇంటిని లీజుకు తీసుకొని, నిత్యం పార్టీ క్యాడర్‌కు అందుబాటులో ఉంటూ వచ్చారు. అలాగే ఈ నియోజకవర్గంలో కురుబ సామాజిక ఓటర్లు అధికంగా ఉండగా, వారందరినీ వైకాపావైపు వచ్చేలా చూడగలిగారు. పెనుకొండ అసెంబ్లీ స్థానం నుంచే మరోసారి బరిలోకి దిగి 14వేల 859 ఓట్ల ఆధిక్యంతో తెదేపా అభ్యర్థి బీకే పార్థసారథిపై విజయం సాధించారు. మొదటి నుంచి పార్టీ విధేయుడిగా ఉండటం, జిల్లాలో కీలకమైన కురబ సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడం, వివాద రహితుడిగా పేరుండటంతో ఆయనకు అధినేత మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు. తొలుత కౌన్సిలర్‌గా ఎన్నికై నేడు మంత్రిస్థాయికి ఎదిగారు.
పెనుకొండకు మూడోసారి పదవి...పెనుకొండ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇప్పటికి 3పర్యాయాలు.. ముగ్గురు మంత్రి పదవులు సొంతం చేసుకున్నారు. 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ఎస్.రామచంద్రారెడ్డి 13 శాఖలకు మంత్రిగా కొనసాగారు. 1994లో పరిటాల రవీంద్ర కార్మిక శాఖ మంత్రిగా రెండేళ్లు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్‌నారాయణ మూడో వ్యక్తి.