ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విత్తుకు పైఎత్తు.. అక్రమాల మత్తు!

అనంతపురం జిల్లా ఎరువులు, పురుగు మందు దుకాణాలపై గురువారం వ్యవసాయ సబ్‌ డివిజన్‌ అధికారులు తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలు కలెక్టర్​ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలు బయటపడ్డాయి. వ్యవసాయాధికారులు దుకాణాలను సీజ్​ చేసినట్లు తెలిపారు.

officers ride on pesticide shops in ananthapur district
తనిఖీలు చేస్తున్న విజిలెన్సు అధికారులు

By

Published : Jul 23, 2020, 5:10 PM IST

ఎరువులు, పురుగు మందులు, విత్తన దుకాణాల్లో డీలర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఆయా దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలపై అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. వ్యవసాయ సబ్‌ డివిజన్‌ అధికారులకు తనిఖీ బాధ్యతలు అప్పగించారు. ఒక డివిజన్‌లోని అధికారులు మరో డివిజన్‌లో తనిఖీలు చేసేలా ఆదేశాలు ఇచ్చారు. దీంతో పలు ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి. రిజిస్టర్‌లో నమోదుకు.. గోదాముల్లో నిల్వలకు వ్యత్యాసం కనిపిస్తోంది. ‘0’ ఫారం లేకుండా విక్రయించడం, నిషేధిత మందుల అమ్మకం, ఎరువులు, విత్తనాల నమూనా ఫలితాలు రాకుండానే విక్రయాలు చేయడం, లైసెన్సులు రెన్యూవల్‌ లేకపోవడం తదితర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం

కొందరు అధికారులు ఎరువుల దుకాణ డీలర్ల నుంచి సొమ్ము వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ అవినీతి బయటపడుతుందని పలువురు భయాందోళన చెందుతున్నారు. తన డివిజన్‌లో అక్రమ వసూళ్లు బయట పడుతాయన్న భయంతో ఒకరికొకరు సర్దుబాటు చేసుకుంటూ.. తనిఖీల్లో మమ అనిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

విక్రయాలు నిలిపివేత

అనంతపురం జిల్లాలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అధికారులు ఎరువులు, పురుగు మందులు, విత్తన దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 1,047 దుకాణాలు ఉన్నాయి. ఇప్పటివరకు 483 దుకాణాల్లో తనిఖీలు పూర్తయ్యాయి. అక్రమాలు వెలుగు చూసిన దుకాణాల్లో ఎరువులు, పురుగు మందులకు సీజ్‌ చేస్తున్నారు. అమ్మకాలను నిలిపేశారు. సీజ్‌ చేసిన దుకాణాలపై నివేదికలు తయారు చేసి జేసీ కోర్టులో వేశామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

సీజ్‌ చేసిన ఎరువులు ఇలా..

ఎరువులు: రూ.1.03 కోట్ల విలువైన 237 మెట్రిక్‌టన్నుల వివిధ రకాల ఎరువుల అమ్మకం నిలుపుదల చేశారు. రూ.5.84 లక్షల విలువైన 59 మెట్రిక్‌ టన్నుల ఎరువులు సీజ్‌ చేశారు.

విత్తనాలు: జిల్లాలో నకిలీ విత్తనాలు ఎక్కువగా అమ్ముతున్నారు. ఇటీవల నిషేధమున్న గడ్డి విత్తనాలు అమ్ముతున్న ఓ డీలరును పట్టుకున్నారు. వివిధ రకాల విత్తనాలు 111 క్వింటాళ్ల అమ్మకం నిలుపుదల చేశారు. విత్తనాలు సీజ్‌ చేసిన దాఖలాల్లేవు.

పురుగు మందులు: జిల్లాలో 217 లీటర్లు వివిధ కంపెనీలకు చెందిన రసాయన మందులను సీజ్‌ చేశారు. వాటి విలువ రూ.3.50 లక్షలు. రూ.28.40 లక్షల విలువైన 438 లీటర్లు మందు అమ్మకం నిలుపుదల చేశారు.

రూ.8.66 లక్షల విలువైన ఎరువుల జప్తు

ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై విజిలెన్సు అధికారులు మెరుపు దాడులు చేశారు. బుధవారం జిల్లా కేంద్రం సాయినగర్‌లోని ఓ దుకాణంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎరువులు, పురుగు మందులను గోదాములో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. దీంతో 62 మెట్రిక్‌ టన్నుల 16 రకాల ఎరువులు, 19 రకాల పురుగు మందులను జప్తు చేశారు. వీటి విలువ రూ.8.66 లక్షలుగా అధికారులు ప్రకటించారు. తదుపరి చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారి శశికళకు సిఫార్సు చేశారు. విజిలెన్సు అధికారులు వాసు ప్రకాష్‌, ఎస్సై బాలకృష్ణయ్య, సిబ్బంది జనార్ధన్‌, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

అనుమతి లేని పురుగుమందుల విక్రయాలు.. వ్యాపారులపై కేసులు

ABOUT THE AUTHOR

...view details