Nemakallu quarry: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఓ కీలక ప్రజాప్రతినిధి తన కుటుంబ సభ్యులు, సిబ్బంది పేర్లతో నిర్వహిస్తున్న రెండు కంకర క్వారీల్లో శనివారం మైనింగ్ అధికారులు తనిఖీలకు వెళ్లారు. కేటాయించిన భూభాగంలో కాకుండా పక్క క్వారీల్లో తవ్వకాలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో వారు తనిఖీలకు వెళ్లారు. అయితే.. వారు అలా వెళ్లి ఇలా వెనక్కి వచ్చేశారు. ఓ మంత్రి, ఇతర అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో వారు వెనుదిరిగినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.
జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటం, కొందరు గనులశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం, కొండంత అండగా ‘అధికారం’ ఉండటంతో నేమకల్లు క్వారీల్లో అక్రమాలు మితిమీరిపోతున్నాయి. దీనిపై బాధితులు కొన్నాళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా గనులశాఖ ఏజీ ప్రసాద్ నేతృత్వంలో అధికారుల బృందం శనివారం అక్కడికి వెళ్లింది. తవ్విన ఖనిజానికి సంబంధించి కొలతలు తీయడానికి అన్ని సిద్ధం చేసుకుంది. రెవెన్యూ అధికారులను క్షేత్రస్థాయికి పిలిపించింది.