ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరవు తీరా వాన కురిసే... అనంత రైతు మోము మురిసె!

అనంతపురం జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో కరవునేల పులకించిపోతోంది. జూన్ నెలలో అనంత జిల్లా పశ్చిమ ప్రాంతంలో వర్షాలు కురిసినప్పటికీ.. 12 మండలాలకే పరిమితమయ్యాయి. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదలడం వల్ల గడిచిన రెండ్రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా నంబుల పూలకుంట మండలంలో 89 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కరవు మండలాల్లో సైతం వాగులు, వంకల్లో ప్రవాహం పరుగులు తీస్తోంది. జిల్లాలో ముదిగుబ్బ, యల్లనూరు మండలాల్లో మాత్రం చినుకు జాడ లేకపోవటంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

వాన కురిసే... అనంత మురిసే
వాన కురిసే... అనంత మురిసే

By

Published : Jun 30, 2020, 8:24 PM IST

వాన కురిసే... అనంత మురిసే

చినుకు కోసం తపించిన కరవునేల రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో పులకించిపోతోంది. కరవు పీడిత జిల్లాలో ఒకటైన అనంతపురంలో వర్షం కురిసిందంటే అక్కడ రైతులకు, ప్రజలకు నిజంగా పండగనే చెప్పవచ్చు. జిల్లాలోని చాలా మండలాల్లో 50 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావటంతో వాగులు, వంకల్లో ప్రవాహం పరుగులు తీస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో గ్రామాల్లోని చెక్ డ్యాంలు, నీటి కుంటలు నిండుతున్నాయి. జూన్ తొలివారంలో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. అనంతరం చినుకు జాడలేని కారణంగా.. అన్నదాతలు ఆందోళన చెందారు. రైతులు విత్తనాలు సిద్ధం చేసుకుని, వాన కోసం ఎదురుచూశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతన్న కంట ఆనందాన్ని తెచ్చాయి.

నమోదైన వర్షపాతాలు

గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. నంబుల పూలకుంట మండలంలో 89 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా, తనకల్లులో 88.6 మి.మీ, శింగనమలలో 87.6 మి.మీ, లేపాక్షిలో 76.4 మి.మీ, ఆమడగూరులో 71 మి.మీ, నల్లమాడ, నల్లచెర్వు, కూడేరు మండలాల్లో 70 మిల్లీ మీటర్ల పైగా వర్షం కురిసింది. మరో ఏడు మండలాల్లో 55 మిల్లీ మీటర్లకు పైగా వర్షం కురిసిందని వాతావరణశాఖ చెబుతోంది. జిల్లా వ్యాప్తంగా 54 మండలాల్లో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదు కాగా.. ఏడు మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. కానీ.. ముదిగుబ్బ, యల్లనూరు మండలాల్లో వర్షపాత లోటు కొనసాగుతోంది.

జిల్లాలో 50 మిల్లీ మీటర్ల వర్షం కురిసిన ప్రాంతాల్లో రైతులు విత్తనాలు వేసుకోవచ్చని వ్యవసాయ, వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు సూచించారు. లోటు వర్షపాతం ఉన్నచోట మాత్రం తొందరపడి విత్తనాలు వేయవద్దని తెలిపారు. వారంలో నైరుతి రుతుపవనాలతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఇదీ చదవండి:

సాఫ్ట్​వేర్​ కుర్రోళ్లు... పేమెంట్ యాప్​లతో మోసాలు

ABOUT THE AUTHOR

...view details