ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసి.. అధికారంలోకి వచ్చిన వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జగన్ పాదయాత్రకు మూడేళ్ళు పూర్తికావడంతో.. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన విజయయాత్రలో మంత్రి పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీ ప్రారంభించారు. అనతి కాలంలోనే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్న జగన్ పనితీరును అందరూ ప్రశంసిస్తున్నారన్నారు. కర్నూలు రోడ్డులోని శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస కాలనీ, విరాఠ్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడారు. సుమారు 75 లక్షల రూపాయలతో కాలువలు, రహదారులు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
జగన్ ప్రజాసంకల్పయాత్రకు మంత్రుల సంఘీభావం
సీఎం జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి కావడంతో.. రాష్ట్ర మంత్రులు సంఘీభావ యాత్రలు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి బాలినేని, అనంతపురం జిల్లా రొద్దంలో మరో మంత్రి శంకర్ నారాయణలు విజయయాత్రల్లో పాల్గొన్నారు. ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్న జగన్ నేర్పును అందరూ అభినందిస్తున్నారని కీర్తించారు. ప్రతిపక్షాలు ఓర్వలేక నిందలు వేస్తున్నాయని విమర్శించారు.
సీఎం జగన్ ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా.. రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని నల్లూరు నుంచి చోళేమర్రి వరకు ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో రచ్చబండ-పల్లె బాట కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక.. తెదేపా నాయకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. పెనుగొండ నాగలూరు చెరువు నుంచి చోళేమర్రి చెరువును.. హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలతో నింపుతామన్నారు. గ్రామస్థుల సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు.
ఇదీ చదవండి:మహమ్మారిపై అవగాహన.. మాస్క్ లేకుంటే జరిమానా