స్థానిక సంస్థల ఎన్నికలకు వైకాపా సిద్ధంగా ఉందని రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో మంత్రి మాట్లాడారు. ఏడాదిన్నర కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామన్నారు. ఇందుకోసం రూ. 60 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలిపారు.
కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఎన్నికల అధికారి తెదేపాకు మేలు చేకూర్చేలా చంద్రబాబు మార్గదర్శకత్వంలో నడుచుకుంటున్నారని ఆరోపించారు. న్యాయస్థానాలను అడ్డుపెట్టుకొని ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థాయికి తగదని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల మేలు కోరుకుంటోందని.. అంతేకాని ఎన్నికల విషయంలో భయం, ఆందోళన లాంటివి తమకు లేవన్నారు. హడావిడిగా ఎన్నికలు నిర్వహించి ఒక పార్టీకి మేలు కలిగించేందుకే రాజకీయ పార్టీల సమావేశాన్ని ఈసీ నిర్వహించిందని విమర్శించారు.