ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sidheswara Temple: ఆ ఆలయంలో నాలుగు చేతులతో శివుడు దర్శనం.. ఎక్కడంటే..! - సిద్ధేశ్వర ఆలయం

Sidheswara Temple in Ananthapuram district: శివాలయాల్లో సహజంగా పరమేశ్వరుడు లింగాకారంలో దర్శనమిస్తారు. కానీ ఆ ఆలయంలో శివుడు చతుర్భుజాకారంలో భక్తులను ఆశీర్వదిస్తూ కనిపిస్తాడు. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ గుడి శిథిలావస్థకు చేరడంతో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వసతులు లేని అనంతపురం జిల్లాలోని సిద్ధేశ్వరస్వామి ఆలయంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం

Sidheswara Temple in Ananthapuram district
శ్రీ హెంజేరు సిద్ధేశ్వరస్వామి ఆలయం

By

Published : Jan 5, 2022, 6:43 AM IST

శ్రీ హెంజేరు సిద్ధేశ్వరస్వామి ఆలయం

Sidheswara Temple in Ananthapuram district: అనంతపురం జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో శ్రీ హెంజేరు సిద్ధేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ప్రతి చోటా శివుడు లింగాకారంలో దర్శనమిస్తే... ఇక్కడ మాత్రం చతుర్భుజాకారంలో కనిపిస్తాడు. కుడివైపు అభయ హస్తం, త్రిశూలంతో.. ఎడమవైపు అక్షయపాత్ర, ఢమరుకంతో సిద్ధాసన స్థితిలో ఉంటూ భక్తులకు దర్శనమిస్తాడు. నిత్యం పరిసర ప్రాంతాల భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.

ఈ ఆలయం ఏడవ శతాబ్ధానికి చెందిన పురాతన దేవాలయం. చోళ రాజులకు సామంత రాజులైన నోళంబ రాజుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ తయారైన శిల్పాలు చోళ రాజుల సామ్రాజ్యాలకు చేరేవని పురావస్తు శాఖ అధ్యయనంలో తేలింది. అందుకు నిదర్శనంగా ఈ ప్రాంతంలో బయటపడ్డ శిల్పాలు ఇప్పటికీ ఆలయ ప్రాంగణంలో ఉన్న పురావస్తు శాఖ మ్యూజియంలో మనకు దర్శనమిస్తాయి.

సిద్ధేశ్వర ఆలయంలో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో శివరాత్రి నుంచి ఎనిమిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయని స్థానికులు తెలిపారు. కార్తికమాసంలో లక్షపుష్పార్చన లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారి దర్శనానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

ఇంతటి చరిత్ర కలిగిన ఈ దేవాలయ కట్టడాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రాత్రిపూట బస చేసేందుకు వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు.దేవాలయానికి వచ్చే భక్తులకు కొదవలేకపోయినా.. సౌకర్యాలు మాత్రం అరకొరగా ఉన్నాయని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి దేవాలయ పునర్నిర్మాణం చేపట్టి..వసతులు కల్పించాలని కోరుతున్నారు.

దేవాలయ పునర్మిర్మాణం, భక్తుల సౌకర్యాల కోసం దేవదాయ శాఖ, పురావస్తు శాఖ అధికారులకు నివేదించామని ఆలయ కమిటీ ఛైర్మన్‌ పేర్కొన్నారు. సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి :

Fake Tickets: శ్రీవారి దర్శనానికి నకిలీ టికెట్లు.. నలుగురిపై కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details