అనంతపురం జిల్లా తాడిమర్రిలో పేదల ఇంటి స్థలాల కోసం పంపిణీ చేయాలనుకున్న 494 సర్వే నెంబర్‌లోని ప్రభుత్వ భూమిని ఓ నాయకుడు కబ్జా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 12 ఎకరాల ప్రభుత్వ భూమిలో జగనన్న కాలనీ నిర్మించి.. పేదలకు ఇవ్వాలని అధికారులు ప్రయత్నించినా.. స్థానిక నేత అడ్డుపడ్డారని చెబుతున్నారు. సమీపంలోని తన సొంత భూమి హద్దులు చెరిపి, ప్రభుత్వ భూమిని ఏడాదిన్నరగా కొద్దికొద్దిగా చదును చేస్తున్నాడని అంటున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ధర్మవరం ఆర్డీవో, తాడిమర్రి తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదని వాపోయారు.
జాతీయ రహదారికి సమీపంలో స్థానిక నేతకు భారీగా భూములున్నాయని చెబుతున్న స్థానికులు ఆ పొలానికి విలువ పెంచుకునేందుకు సర్కారు స్థలంలో నుంచి రోడ్డు వేయిస్తున్నారని చెబుతున్నారు. భూ ఆక్రమణపై తాడిమర్రి వాసులు ఈనాడు, ఈటీవీ ప్రతినిధులను సంప్రదించగా.. విషయాన్ని వారు తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. భూ పరిశీలనకు ఆర్ఐ, సర్వేయర్‌ను తహశీల్దార్ పంపారు. కొంత మేర కబ్జాకు యత్నించినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆక్రమణకు గురి కాకుండా బోర్డులు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. గ్రామ పరిధిలోని సర్కారీ స్థలాలు కనుమరుగవకుండా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని తాడిమర్రి వాసులు కోరుతున్నారు.