అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో హిందూపురం ప్రధాన రహదారి విస్తరణ వ్యవహారం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇప్పటికే పదుల సార్లు సర్వే నిర్వహించిన అధికారులు ఆక్రమణలకు సంబంధించి మూడుసార్లు మార్కింగ్ ఇచ్చారు. భవనాల యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా జేసీబీ సాయంతో నిర్మాణాలను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న భవన యజమానులు అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. యజమానుల ఆందోళనకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అధికారుల తీరును తప్పు పట్టారు.
నాలుగైదు సార్లు మార్కింగ్ ఇవ్వడం.. న్యాయస్థానాల పరిధిలో ఉన్న వాటిని సైతం ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కూల్చివేయడం సరికాదన్నారు. ఆక్రమణలుగా గుర్తించిన వాటిని తామే తొలగించుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత కూడా ఉన్నఫలంగా యజమానులకు నష్టం వాటిల్లే కూల్చివేతకు పూనుకోవడం దౌర్జన్యమని మండిపడ్డారు. తెలుగుదేశం నాయకులు, స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో అక్కడి నుంచి అధికారులు వెనుతిరిగారు.