రాయలసీమ అనగానే వర్షాభావ పరిస్థితులు గుర్తొస్తాయి. వెంటాడే కరవు పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ నాలుగు జిల్లాల్లో రైతులు మాత్రం వేరుశనగ పంటను సాగుచేస్తుంటారు. వర్షాభావాన్ని తట్టుకొని, చీడ పీడలను ఎదుర్కొనెలా కొత్త రకం వేరుశనగ విత్తనాలను అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కదిరి-లేపాక్షి రకం విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా మూడేళ్ల పాటు 10 చోట్ల ఈ రకం విత్తనాలపై పరిశోధనలు నిర్వహించారు.
రాయలసీమ జిల్లాల్లో ఖరీఫ్‌లో ఏడు లక్షల హెక్టార్లకు పైగా రైతులు వేరుశనగ సాగుచేస్తుంటారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 4.60 లక్షల హెక్టార్లలో సాగు చేస్తుండగా, చిత్తూరు జిల్లాలో లక్షా 12 వేల హెక్టార్లు, కర్నూలు లో 88 వేల 266 హెక్టార్లు, కడపలో 24,600 హెక్టార్లలో సాగవుతోంది. ఎక్కువ మంది రైతులు కె-6, కె-9 రకాలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన కొత్త వంగడం రైతులకు అన్ని విధాలా ప్రయోజనంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. కదిరి-లేపాక్షి రకంలో 51 శాతం నూనె పాళ్లు ఉంటుంది. ఈ రకాన్ని రాయచూరు, గుజరాత్‌లోని పలు రకాల కన్నా 21 నుంచి 44 శాతం నూనె ఎక్కువని తేల్చారు.