అనంతపురం జిల్లా కదిరిలో శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. పదిహేను రోజులపాటు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగిన రథోత్సవం తరువాత స్వామివారి వేడుకకు భారీగా భక్తులు తరలివచ్చే కార్యక్రమం ఉతతీర్థవాది. ఉదయం యాగశాలలో ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు సంప్రదాయబద్దంగా ఉభయ దేవేరులతో కూడిన స్వామివారిని ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా భృగుతీర్థానికి తీసుకొచ్చారు.
అర్చకులతో పాటు ఆలయ సిబ్బంది, స్వామివారి భక్తులు రంగులు చల్లుకుంటూ సంబంరంగా స్వామివారి పల్లకిని మోసుకొచ్చారు. అర్చకులు చక్రస్నానానికి అవసరమైన దినుసులను సిద్ధం చేసి కోనేరుకు చేరుకున్నారు. వసంత వల్లుభుడైన శ్రీవారి పల్లకి ముందు భక్తిశ్రద్ధలతో వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు భృగుతీర్థంలో చక్రస్నానం ఆచరించారు. స్వామివారి చక్రస్నానాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భృగుతీర్థం పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.