దశాబ్దంన్నర కాలంగా ఆంధ్రప్రదేశ్- కర్ణాటక రాష్ట్రల మధ్య నలుగుతున్న సరిహద్దు వివాదం మరో రెండు నెలల్లో సమసిపోనుంది. మైనింగ్ కంపెనీలు అక్రమంగా చొరబడి.. అంతర్రాష్ట్ర సరిహద్దులను చెరిపేసిన విషయం తెలిసిందే. ఈ సరిహద్దులు పునరుద్దరించటంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. భూ భాగం తమదంటే.. తమదనే దోరణిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు పట్టుబట్టి, సుప్రీం కోర్టుకు వెళ్లాయి.
దీంతో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గతంలో 8 సార్లు నిర్వహించిన సర్వేల ఆధారంగా గుర్తించిన హద్దులను.. మరోసారి పరిశీలించి రెండు రాష్ట్రాల భూ భాగాన్ని విభజించి పిల్లర్లు వేయనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య విభజన రేఖను సూచించే భూభాగం 17 కిలోమీటర్లు ఉందని సర్వే ఆఫ్ ఇండియా అధికారులు నిర్దరించారు. శుక్రవారం అధికారుల బృందం డి.హీరేహాల్ మండలంలోని సిద్ధాపురం, ఓబులాపురం, మలపనగుడి గ్రామాల్లో పర్యటించి ముందస్తు పరిశీలన చేశారు.
అక్రమ మైనింగ్‌తో చొరబడిన ప్రాంతంలో ఇరు రాష్ట్రాల హద్దుల రాళ్లు తొలగించగా.. అక్కడక్కడా పూర్వం హద్దు రాళ్లు గుర్తించారు. ఈ హద్దుల నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 17 కిలోమీటర్ల పొడవునా సరిహద్దులు పక్కాగా చేయనున్నారు. గతంలో అధికారులు వేసిన ప్రాథమిక అంచనా ప్రకారం 110 హద్దు రాళ్లు వేయాలని నిర్ణయించగా.. క్షేత్రస్థాయి తాజా పర్యటనతో 130 వరకు పిల్లర్లు నిర్మించాలని తేల్చారు. ఈ సంఖ్య అవసరాన్నిబట్టి పెంచాల్సి రావచ్చని ఇరు రాష్ట్రాల జిల్లా అధికారులకు సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు చెప్పారు.