చేతికొచ్చే పంటంతా తడిసిపోయింది.. రైతు కంట కన్నీరే మిగిలింది. లాభాల మాట దేవుడెరుగు.. పెట్టుబడి డబ్బులే దక్కని పరిస్థితి నెలకొంది. అతివృష్టి, అనావృష్టి వెంటాడుతూ అన్నదాతను మరింత అప్పుల ఊబిలోకి నెట్టుతున్నాయి. ఈసారి భారీ వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లాలో ప్రధాన పంట అయిన వేరుసెనగ, సాధారణ విస్తీర్ణం కన్నా అత్యధికంగా సాగయింది. సుమారు 12 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఎకరానికి రెండు, మూడు బస్తాలు కూడా రాలేదు. వేరుసెనగ రైతు కోలుకోలేని దుస్థితి నెలకొంది. సెప్టెంబరు, ఆక్టోబరు నెలల్లో భారీ వర్షాలు కురువడంతో తొలగించిన వేరుసెనగ పంటంతా తడిసిపోయింది. కనీసం పశుగ్రాసం కూడా దక్కని పరిస్థితి. దిగుబడి తగ్గిందని పంటకోత ప్రయోగాలూ వెల్లడించాయి. వర్షాలకు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు పంట నీట మునిగి, కొట్టుకుని పోయింది.
- 13,050 హెక్టార్ల నష్టం
జిల్లాలో సెప్టెంబరు, ఆక్టోబరులో కురిసిన భారీ వర్షానికి 13,050 హెక్టార్లలో రూ.20 కోట్ల వరకు పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. నివేదికను ప్రభుత్వానికి పంపగా, క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని జిల్లాకు పంపనున్నారు. అందులో ప్రధానంగా వేరుసెనగ పంట 9,828 హెక్టార్లలో రూ.14 కోట్లు, పత్తి 2,501 హెక్టార్లలో రూ.3.7 కోట్లు, వరి 422 హెక్టార్లలో రూ.70 లక్షలు, మొక్కజొన్న 102 హెక్టార్లలో రూ.12 లక్షలు దెబ్బతిన్నాయి.
- వేరుసెనగ రైతుకు కోలుకోలేని దెబ్బ
గత ఏడాది తొలకరిలో వర్షాలు అనుకూలించడంతో ఖరీఫ్‌లో జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో సాగైంది. జూన్, జులైలో అత్యధింగా వర్షాలు కురిశాయి. ఆ నెలల్లో ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో మొక్కలు ఏపుగా పెరిగాయి. కాని పూత, కాయ లేదు. మొక్కకు రెండు, మూడు కాయలు మాత్రమే ఉన్నాయి. ఎకరానికి రెండు, మూడు బస్తాలు కూడా దిగుబడి రాని పరిస్థితి. పంటకోత ప్రయోగాల ద్వారా హెక్టారు 1100 కిలోలు దిగుబడి రావాల్సి ఉండగా 400-500 కిలోలు మాత్రమే దిగుబడి వచ్చిందని ముఖ్య ప్రణాళికశాఖ గణాంకాలు చెబుతున్నాయి. దాన్ని బట్టి జిల్లాలో వేరుసెనగ సుమారు రూ.1500 కోట్ల నష్టంవాటిల్లిందని వ్యవసాయశాఖ అధికారుల అంచనా.
- కొనేదెవరు..?
జిల్లాలో తడిసిన వేరుసెనగ కాయలు నల్లగా మారాయి. ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,275 మద్ధతు ధర ప్రకటించింది. గింజ బరువు 70 శాతం ఉండాలి. తేమ 8 శాతం లోపు ఉండాలని ప్రభుత్వ నిబంధన. కాయలు రంగు మారడం, గింజ బరువు శాతం తక్కువగాను తేమ శాతం ఎక్కువగా ఉండటంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడంలేదు. అరకొరగా పండిన పంటను ఎవరూ కొనడంలేదని రైతులు వాపోతున్నారు. ఇటీవల మార్కెటింగ్‌శాఖ ప్రధాన కార్యదర్శి మధుసూధన్‌రెడ్డి జిల్లాలో పర్యటించి, వేరుసెనగ పంటను పరిశీలించారు. ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని రైతులు వేడుకున్నారు.
- కనిపించని కొనుగోలు కేంద్రాల జాడ
వేరుసెనగ పంట తొలగింపు ప్రక్రియ పూర్తవుతున్నా.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల జాడ లేకుండాపోయింది. దీంతో రైతులు వాటిని నిల్వ ఉంచేందుకు ఇబ్బంది పడుతున్నారు. రైతులు తమ గ్రామాల్లోనూ, బళ్లారి లాంటి మార్కెట్‌లలో దళారులు, కమీషన్ ఏజెంట్ల సాయంతో వాటిని అమ్మేస్తున్నారు. అందరూ రైతులు అదే దారిలో సాగక ముందే కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.
నేడు కేంద్ర బృందం పర్యటన