అనంతపురం జిల్లా(anantapur district)లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి (heavy rains) ముదిగుబ్బ, బుక్కపట్నం ప్రధాన రహదారి 15 కి.మీ.ల మేర పూర్తిగా దెబ్బతింది. అటవీ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీరు ప్రధాన రహదారి పక్కనే ఉన్న హంద్రీనీవా కాలువలోకి ఒక్కసారికి ఉద్ధృతంగా ప్రవహించటంతో కోతకు గురైంది. కుంట్ల ప్రాంతంలో 50 మీటర్ల మేర ఉన్న సిమెంటు రోడ్డు కింది భాగం కోతకు గురై ప్రమాదకరంగా మారింది. హంద్రీనీవా కాలువలోకి వరద నీరు పెద్దఎత్తున రావడంతో కాలువ పైభాగం సైతం కోతకు గురైంది. చెండ్రాయనిపల్లి సమీపంలో రోడ్డుపై రెండు అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ రహదారి గుండా బెంగళూరుకు వెళ్లే భారీ వాహనాలను ముదిగుబ్బ నుంచే దారి మళ్లించారు. కోతకు గురైన ప్రాంతాన్ని నేషనల్ హైవే డీఈఈ రామచంద్రరెడ్డి, ఎంపీపీ శ్రీధర్‌రెడ్డిలు పరిశీలించారు. వాహనాలు ఆ మార్గంలో ప్రయాణించకుండా ఎస్సై నరసింహుడు పోలీసులతో వెళ్లి బారికేడ్లు ఏర్పాటు చేశారు.
మరువ ప్రవాహంతో మునిగిన వరి పొలాలు
బుక్కపట్నం చెరువు మరువ ప్రవాహం ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. మండల కేంద్రం కొత్తచెరువు దగ్గర 180 మీటర్ల పొడవున్న ప్రధాన మరువ అడుగు ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి చిత్రావతి నది నుంచి వరద రాకతో మరువ ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తచెరువు - బుక్కపట్నం మధ్య వంతెన తాకుతూ నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీనివల్ల గోరంట్లపల్లి మార్గంలోని గుర్రాల రోడ్డులో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మైలసముద్రం చెరువు ఆయకట్టులో నీట మునిగిన పొలాలను వ్యవసాయాధికారి నటరాజ్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి జరిగిన నష్టం వివరాలను తెలుసుకున్నారు.