'హంద్రీనీవా'కు గండి... పొలాల్లోకి వరద
నిన్న రాత్రి కురిసిన వర్షాలకు హంద్రీనీవా కాలువకు గండి పడింది. సుమారు 100 ఎకరాల్లో భూమి కోతకు గురైందని రైతులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వ్యాసపురం గ్రామ సమీపంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హంద్రీనీవా ఉపకాలువకు (డిస్ట్రిబ్యూటర్ 2 ) మూడు చోట్ల గండి పడింది. దీనివల్ల దాదాపు 100 క్కూసెక్కులకు పైగా నీరు వృథాగా పొలాల్లోకి వెళ్లింది. 100 ఎకరాలకు పైగా భూమి కోతకు గురైనట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి నెరిమెట్ల, రాయంపల్లి, వ్యాసపురం గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. అప్పటికే ఉపకాలువలో నీరు నిండుగా ప్రవహిస్తోంది. ఆ నీటికి వర్షపు నీరు కూడా తోడవటంతో గండి పడిందని రైతులు అన్నారు. దీనివల్ల తమ భూములు కోతకు గురయ్యాయని, అధికారులు పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.