'అమ్మ ఒడి' అర్హుల జాబితాలో విచిత్రాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలకు జాబితాలో చోటు లభించింది. జాబితాలను ప్రధానోపాధ్యాయులకు మంగళవారం పంపారు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలోని బుక్కపట్నం, నార్సింపల్లి, బుచ్చయ్యగారిపల్లి ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల పిల్లల పేర్లు జాబితాలో ఉన్నాయి. పలుపాఠశాలల్లో 5, 7 వరకే తరగతులు నిర్వహిస్తున్నా..6, 8 చదివే పిల్లల పేర్లూ చేర్చారు.
అమరాపురం మండలంలోని ఓ పాఠశాలలో లేని విద్యార్థి పేరు కనిపించింది. నంబులపూలకుంటలో ఆదాయపన్ను చెల్లిస్తున్నామని నమోదుచేసినా జాబితాలో పేర్లు వచ్చాయి. ఈ విషయంపై.. బుక్కపట్నం ఎంఈఓ గోపాల్‌నాయక్ మాట్లాడుతూ.. నమోదు సమయంలో దారిద్య్రరేఖకు ఎగువన(నాన్ బీపీఎల్) ఉన్నట్లు నమోదుచేశారని, ముగ్గురు ఉపాధ్యాయుల పిల్లలకు జాబితాలో చోటు లభించినట్లు తెలిపారు. పేర్లు తొలగించాలని ఉపాధ్యాయులు కోరారని, ప్రస్తుతం తొలగింపు ఆప్షన్ లేదని వివరించారు.