కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ... రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు అనంతపురం జిల్లా ఉద్యానశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతుల నుంచి పండ్లు కొనుగోలు చేసి వాటిని బొకే రూపంలో లాభం లేకుండా ప్రజలకు విక్రయించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఉద్యానశాఖ తరుఫున గార్లదిన్నెకు చెందిన రైతు ఉత్పత్తిదారుల సంఘం ఈ బాధ్యతను తీసుకుంది.
స్థానిక రైతు బజార్లో పండ్ల విక్రయాన్ని ప్రారంభించారు. అరటి, జామ, చీనీ, బొప్పాయి, కర్భూజ పండ్లను కలపి వంద రూపాయలకు అందిస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన పండ్లను అందించడమే కాక.. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం తమ ఉద్దేశమని ఉద్యానశాఖ డీడీ సుబ్బరాయుడు తెలిపారు. ప్రజలంతా కచ్చితంగా పండ్లు, కూరగాయలు తినాలని... దాతలు స్పందించి రైతుల వద్ద కొనుగోలు చేస్తే తాము సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.