ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రజలకు దరి చేరకూడదంటే భౌతికదూరం పాటించడం, ముఖానికి మాస్కులు ధరించడం, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం ప్రాథమిక సూత్రం. ఇది కూడా పాటించని చాలామంది ప్రజలు వైరస్ బారిన పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్నవారికి మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కొంతవరకు అవగాహన ఉంది. కానీ మారు మూల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల పరిస్థితి ఏంటనే ఆలోచన ఆ యువకుడి మనసులో మెదిలింది. కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో ఇటివలే.. లలితకళ (ఫైన్ ఆర్ట్స్) పూర్తి చేసిన సోమశేఖర్... ప్రజలకు కొవిడ్ పై అవగాహన కల్పించాలని సంకల్పించాడు.
సోమశేఖర్.. తన సొంత ఊరైన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తి గ్రామానికి వెళ్లాడు. తాను నేర్చుకున్న కళ ద్వారా ప్రజలను చైతన్యం చేయాలనుకున్నాడు. ఏప్రిల్ నుంచి జులై వరకు ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోని గ్రామాల్లో పర్యటించాడు. గ్రామాల్లో వాల్ పెయింటింగ్స్ వేస్తూ కొవిడ్ పై అవగాహన కల్పించే ప్రక్రియ చేపట్టాడు. గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను ఎదురుగా పెట్టుకునే వారి బొమ్మలనే గోడలపైన వేస్తూ వైరస్ పై చైతన్యం తెచ్చాడీ యువకుడు.
కరోనా వైరస్ కు దూరంగా ఉండాలంటే ముఖానికి మాస్కులు ధరించాలనే బొమ్మలను గోడలపైన రంగులతో వేశాడు. శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తూ బొమ్మలు వేశాడు. భౌతిక దూరం పాటించాలని బొమ్మలు వేశాడు. ఇలా అనేక రకాలుగా అవగాహన కల్పించే బొమ్మలను వేయడంతో ప్రజలు కూడా ఆసక్తిగా తిలకించేవారు. ఇలా.. ఆంధ్రాలో 53 గ్రామాలు, కర్నాటకలో 48 గ్రామాల్లో పెయింటింగ్స్ వేశాడు. మొత్తం 250 పెయింటింగ్స్ వేయడం ద్వారా ప్రజలకు వైరస్ పై అవగాహన కల్పించాడు. ముందుగా 55 గ్రామాల వరకు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని బైక్ మీద పయనిస్తూ.. రంగులు కొనుగోలు చేసి పెయింటింగ్ వేశాడు. అనంతపురం జిల్లాలోని ఇంటి నుంచి క్యారియర్ తీసుకుని గ్రామాల్లో తిరుగుతూ పెయింటింగ్ వేయడం... రాత్రికి ఇంటికి రావడం చేసేవాడు. తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఇతను వేసిన చిత్రాలు వైరల్ కావడంతో అనంతపురం జిల్లాలోని ఆర్డీటీ సంస్థ చేయూత నిచ్చింది. గ్రామాల్లో తిరగడానికి కావాల్సిన ఆర్థిక సాయం చేయడంతో మిగిలిన గ్రామాల్లో పని పూర్తి చేశాడు సోమశేఖర్.