రైతుల వద్దకే వ్యవసాయ ఉత్పాదకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే అనంతపురం, కళ్యాణదుర్గం, కదిరి, ధర్మవరం, పెనుకొండలో కూడా నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. జిల్లా వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గోదాముల్లో ఉన్న ఎరువులు.. రైతు భరోసా కేంద్రాలకు చేరడం లేదు.
అనంతపురం జిల్లాలో ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తెల్లవారుజామునే వచ్చి రైతు భరోసా కేంద్రాల్లో(ఆర్బీకే) పడిగాపులు కాస్తున్నారు. నగదు చెల్లించినప్పటికీ వారాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. జిల్లాలోని బఫర్ కేంద్రాల్లో తగినంత నిల్వలు ఉన్నప్పటికీ రైతు భరోసా కేంద్రాలకు చేర్చటంలో వ్యవసాయశాఖ విఫలమవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో పంటకు ఎరువులు వేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "అకాల వర్షాల కారణంగా ఎరవుల వాడకం బాగా పెరిగింది. దీంతో రైతు భరోసా కేంద్రాలు చుట్టూ తిరగలేక కర్ణాటకలోని బళ్లారికి వెళ్లి అధిక ధరకి ఎరువులు కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నాం" అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.