అనంతపురం జిల్లా ఉరవకొండ, గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగయ్యే ప్రధాన పంట వేరుసెనగ. తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రం పత్తి పంటకు ప్రాధాన్యం ఇస్తారు. ఖరీఫ్ వేళ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.
వరుణుడి కరుణ కోసం ఎదురుచూపు
ఉరవకొండ, గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, తాడిపత్రి నియోజకవర్గాల్లో అత్యధిక శాతం పంటలు వర్షాధారంగా సాగవుతాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో వారం రోజులుగా వర్షం జాడలేదు. మిగతా ప్రాంతాల్లో కొద్దో గొప్పో పడుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలకు రైతులు పొలాలు సిద్ధం చేసుకున్నారు. మరికొందరు అరకొర వర్షానికే వేరుసెనగ, ఆముదం లాంటి పంటలు సాగు చేశారు. ప్రస్తుతం వర్షం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రాయితీ వేరుసెనగ విత్తన కాయలను అందించగా, వాటితో పాటు బయట మరింత విత్తనాన్ని కొని సిద్ధంగా ఉంచుకున్నారు.