అనంతపురం జిల్లాలో రైతు భరోసా - పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులు ఆరున్నర లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో ఇప్పటికీ లక్షా 78 వేల మందికి ఎలాంటి లబ్ధి చేకూరలేదు. ఆందోళనకు గురైన రైతులు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు అడిగిన ప్రతిసారి అవసరమైన పత్రాలను అందజేస్తున్నారు. అయినా తమకు రావలసిన డబ్బు రావడం లేదంటూ కర్షకులు ఆవేదన చెందుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే రేపూ.. మాపూ అంటూ అధికారులు సమాధానం దాటవేస్తున్నారని చెబుతున్నారు. బ్యాంకులో అడిగితే తమకు సంబంధం లేదంటున్నారని వాపోతున్నారు.
సాంకేతిక కారణాల వల్లే కొందరు రైతుల ఖాతాల్లో డబ్బు జమ కావడం లేదని అధికారులు చెబుతున్నారు. రైతుల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాల్లో సమస్యల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని... ప్రభుత్వం నిర్దేశించిన మేరకు నవంబర్ 15లోగా అర్హులైన రైతులందరికీ లాభం చేకూరేలా చర్యలు చేపడతామని అనంతపురం జిల్లా వ్యవసాయశాఖ జేడీ చెబుతున్నారు.