రాయలసీమకు సాగునీరు ఇచ్చేందుకు చంద్రబాబు నిరంతరం తపించారని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. ఒక్క అనంతపురం జిల్లాకే 10 వేల కోట్ల రూపాయలను నీటి ప్రాజెక్టులపై ఖర్చు పెట్టారని తెలిపారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను జగన్.. వివాదాల కేంద్రాలుగా మార్చారని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రాయలసీమను శత్రు ప్రాంతంగా చూసే వాతావరణం జగన్ సృష్టించారని ఆరోపించారు.
ముచ్చుమర్రి ప్రాజెక్టులో అదనంగా పంపులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్న వాడుకోలేదని విమర్శించారు. కొత్త ప్రాజెక్ట్ పేరు పెట్టి ఆయకట్టు పెరగకపోయినా రాయలసీమ ప్రయోజనాలను సీఎం వివాదంగా మార్చారని ధ్వజమెత్తారు. ముచ్చుమర్రి కింద 12 పంపుల నిర్మాణం పూర్తి చేస్తే, కర్నూలు జిల్లా మొత్తానికి సాగునీరు అందేదని వివరించారు. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ లో రాయలసీమ ప్రాజెక్టులకు చేటు తెచ్చేలా వివాదాలు రావడానికి జగన్ వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.