ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pension: 110 ఏళ్ల వృద్ధుడికి అందిన పింఛన్​... ఆ కథనమే కారణం..! - అనంతపురం జిల్లాలో వృద్ధుడికి పింఛన్​

Pension to 110 years old man: పింఛన్‌తోనే ఆ 110 ఏళ్ల వృద్ధుడు కాలం వెల్లదీస్తున్నారు. నెలనెలా వచ్చే ఆ డబ్బుతోనే... తిండి, మందులు. సాంకేతిక కారణాలతో... జీవనాధారమైన పింఛన్​ నిలిచిపోయింది. ఆ తర్వాత పింఛన్ కోసం చేయని ప్రయత్నాలు లేవు. ఎవరూ ఇసుమంతైనా కనికరం చూపలేదు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం ఈటీవీ భారత్​ దృష్టికి వచ్చింది. పెద్దాయన కష్టాలపై... ఈటీవీ భారత్​ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కథనం ప్రచురితం చేసింది. ఎట్టకేలకు స్పందించిన అధికారులు... వృద్ధుడికి మళ్లీ పింఛన్‌ అందించారు. దీంతో ఆ వయోజనుడి మోములో చిరునవ్వులు విరిశాయి.

pension
110 ఏళ్ల వృద్ధుడికి పింఛన్​

By

Published : Sep 11, 2022, 10:14 AM IST

Updated : Sep 11, 2022, 12:20 PM IST

Pension to 110 years old man: ఈయన పేరు వెంకటరెడ్డి. ఈయన వయసు 110 ఏళ్లు. స్వస్థలం అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు. రోడ్డు ప్రమాదం ఈయన ఇద్దరు కుమారులను పొట్టనపెట్టుకుంది. బిడ్డలను కోల్పోయిన బాధతో ఒంటరిగా కుమిలిపోయేవారు. ఈ పరిస్థితుల్లో కుమార్తె నాగేంద్రమ్మే తండ్రి బాగోగులు చూసుకుంటున్నారు. అంతంతమాత్రపు ఆదాయం ఉన్న నాగేంద్రమమ్మ... తండ్రి వెంకట్రెడ్డి పింఛన్‌తోనే కుటుంబాన్ని ఏదోలా నెట్టుకొస్తున్నారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ వేస్తేనే పింఛన్ అందిస్తున్నారు. చేతి రేఖలు చెరిగిపోయి, కనుపాపలు దెబ్బతిన్న 110 ఏళ్ల ఈ పెద్దాయన్ను... సాంకేతిక పరికరాలు గుర్తించకపోవడంతో జాబితా నుంచి పేరు తొలగించారు. జీవనాధారమైన పెన్షన్‌ కూడా అందకపోవడంతో... తండ్రీకుమార్తెలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు . పింఛన్ పునరుద్ధరించాలని కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా లాభం లేకపోయింది. ప్రయాణ ఖర్చులు పోవడం తప్ప పెన్షన్‌ రాలేదు.

స్వాతంత్ర్య ఉద్యమంలో వెంకటరెడ్డి కార్యకర్తగా పనిచేశారు. మహాత్మగాంధీ అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు... ఆయనకు సపర్యలు కూడా చేశారు. ఉద్యమంలో పాల్గొన్నా జైలుకు వెళ్లకపోవడం వల్ల స్వాతంత్ర్య సమరయోధుల పింఛన్‌కు అర్హత సాధించలేదు. ఇలా ఏ పెన్షన్ రాక... ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. వృద్ధుడి పింఛన్ కష్టాలపై ఆగస్టులో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు చేరింది. చేతిరేఖలు, కనుపాపల గుర్తింపు నిబంధన నుంచి వెంకటరెడ్డికి మినహాయింపు ఇచ్చారు. దీంతో ఈనెల 7న పామిడి ఎంపీడీవో స్వయంగా వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి పింఛన్ కానుక ఉత్తర్వులతో పాటు... 2వేల 500 రూపాయల డబ్బులు అందించారు. మళ్లీ పింఛన్ రావడం పట్ల వృద్ధుడు పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

"పింఛను ఇచ్చి పోయినారు. ఇంతకు ముందు నిలిచిపోయిండే. ఇప్పుడు మళ్ల ఇచ్చిపోయినారు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఈటీవీ భారత్​ వాళ్లు వచ్చినంకనే నాకు ఈ డబ్బులు వచ్చినాయి." -వెంకటరెడ్డి, పింఛన్ లబ్ధిదారుడు

పింఛన్ పునరుద్ధరించడంపై వెంకటరెడ్డి బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీ కృషి వల్లే మళ్లీ పింఛన్ వచ్చిందని కృతజ్ఞతలు చెప్పారు.

"పింఛను రాక సంవత్సరం ఆరు నేలలు అవుతోంది. అధికారులు ఇవ్వలేదు. మేము చాలా సార్లు కార్యాలయాల చుట్టూ తిరిగాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈటీవీ భారత్​లో వేయిద్దామని ఒకరు చెబితే వాళ్లు కథనం వేశారు. అందులో వార్త చూసిన ఎంపీడీవో వచ్చి చూసి పింఛను ఇచ్చిపోయినాడు ఇప్పటికి." -నాగేంద్రమ్మ, వెంకటరెడ్డి కుమార్తె

"ఈ పెద్దాయనకు పింఛను రాలేదని చాలా మంది నాకు ఫోన్​ చేశారు. నేను ఈటీవీ భారత్​వారిని సంప్రదించాను. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి చూసిన తర్వాత ఈటీవీ భారత్​ వారు చాలా ప్రయత్నించారు. వారి కథనంతోనే అధికారులు సంప్రదించి పెద్దాయనకు పింఛను ఇచ్చి వెళ్లారు. ఇది చాలా సంతోషకరమైన విషయం." -సూర్యనారాయణరెడ్డి, వెంకటరెడ్డి బంధువు


ఇవీ చదవండి:

Last Updated : Sep 11, 2022, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details