ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేల్కొన్న మానవత... దాతలు చూపారు ఉదారత

కష్టాల్లో ఉన్నప్పుడే ఒకరికొకరు సాయం అందించుకోవాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం బాధ్యతగా భావించాలి. ఈ మాటలను ఆచరించి చూపిస్తున్నాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. కరోనా కోరలు చాచిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ.. అన్నార్తులకు అండగా నిలుస్తున్నాయి.

donors-helping-the-poor-people
మేల్కొన్న మానవత...దాతల ఉదారత

By

Published : Mar 29, 2020, 6:58 PM IST

మేల్కొన్న మానవత...దాతల ఉదారత

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దాతలు సేవాభావంతో ఉదారత చాటుకుంటున్నారు. పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేస్తూ... అండగా నిలుస్తున్నారు. కరోనా నివారణ చర్యల్లో వైద్యారోగ్యశాఖ సేవలు అద్వితీయమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దాతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. కడపలోని ప్రభుత్వాసుప్రతికి అవసరమైన సుమారు లక్ష రూపాయల విలువైన ఆధునిక పరికరాలను పట్టణంలోని ఎస్ఎస్సీ 1983 బ్యాచ్ పూర్వ విద్యార్థుల కమిటీ ఉచితంగా అందజేసింది. ఆసుపత్రి అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని పర్యవేక్షకుడు దేవయ్య, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అభినందించారు.

నిరుపేదలకు అన్నదానం...

ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. పేద ప్రజలకు, రోజూవారీ కూలీలకు, యాచకులకు పట్టెడన్నం దొరకని పరిస్థితి నెలకొంది. ఈ కొరతను తీర్చేందుకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ముస్లిం యువకులు, మరికొంత మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆకలితో అలమటించే వారికి మేమున్నామనే ధైర్యాన్ని ఇచ్చారు. పట్టణానికి చెందిన ఖిద్మత్ హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు.. 300 మంది యాచకులకు, నిరుపేదలకు అన్నం పెడుతున్నారు. వీరితో పాటు... లాక్ డౌన్ ఎత్తివేసే వరకు పేదలకు అన్నదానం చేసేందుకు ముందుకొచ్చింది హేమలత సంస్థ. భవన నిర్మాణ కార్మికులకు, మురికి వాడల్లోని పేదలకు భోజన ప్యాకెట్లు సరఫరా చేశారు.

పేదలకు చేయూత...

అనంతపురం జిల్లా ధర్మవరంలో 400 మంది పేద కుటుంబాలకు అవసరమైన కిరాణా సరుకులను.. పట్టణానికి చెందిన కిరాణ వ్యాపారి సాయిరాం, జామియా మసీదు కమిటీ ప్రతినిధులు.. సంయుక్తంగా అందజేశారు. జామియా మసీదు ఆవరణలో ఆర్డీవో మధుసూదన్ చేతుల మీదుగా ప్రజలకు సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు, గోధుమపిండి, సేమియా తదితర వస్తువులతో కూడిన కిట్లు పంపిణీ చేశారు. సరుకులతో పాటు రూ. 500 నగదును ఒక్కో కుటుంబానికి అందజేశారు. జిల్లాలోని కదిరి కార్పెంటర్ల సంఘం... పట్టణంలోని 300 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. రోజూవారీ వేతనంపై ఆధారపడిన కుటుంబాలను ఎంపిక చేసుకొని 12 రకాల వస్తువులను కార్పెంటర్ల సంఘం సమకూర్చుంది. స్థానిక శాసనసభ్యుడు సిద్ధారెడ్డి చేతులమీదుగా పేదలకు అందజేశారు.

ఉచితంగా పాలు పంపిణీ

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణంలో మారెంపల్లి కాలనీలో పేదలకు ఉచితంగా 800 లీటర్ల పాల పాకెట్లను తిరుమల డైరీ నిర్వాహకుడు వీరా.. మిత్రులతో కలసి పంపిణీ చేశారు. కల్యాణదుర్గం పట్టణంలో పేదలకు పౌష్టికాహారం అందించే ప్రయత్నంగా ఇవి పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ఉచితంగా బియ్యం, కూరగాయలు పంపిణీ...

అనంతపురం జిల్లా చినగంజాం మండలం రాజమాత కాలనీలో ఉంటున్న 90 నిరుపేద కుటుంబాలకు... పర్వతరెడ్డి రాంబాబు అనే యువరైతు 250 కిలోల బియ్యం పంపిణీ చేశారు. పెద్దగంజాం, యానాది కాలనీలలో అంకమ్మ రెడ్డి అనే వ్యక్తి 350 కుటుంబాలకు 5 కిలోల చొప్పున 1,750 కిలోల కూరగాయలను ఉచితంగా పంచిపెట్టారు.

ఉచితంగా మాస్క్​లు సరఫరా..

కరోనా వ్యాప్తిని నివారించడానికి వైయస్సార్ క్రాంతి పథకం అధికారులు చొరవ చూపుతున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ క్లస్టర్ పరిధిలోని ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, గుంతకల్లు మండలాల్లోని యానిమేటర్లు, సంఘాల సభ్యులతో మాస్కులు తయారు చేయించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో మహిళా సంఘాలు ఇప్పటికే నియోజకవర్గంలో 12 వేల మాస్కులను ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. మరోవైపు.. మున్నంవారిపాలేనికి చెందిన ప్రొటెక్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రమణా రెడ్డి 200 మాస్కులను పంచిపెట్టారు.

ఇవీ చదవండి:

ఇవాళ రేషన్​ షాపుల్లో నిత్యావసరాల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details