Diesel Scam Of YCP Leaders In Anantapur: ‘ఆర్టీసీ డిపోలకు అందరికంటే ఒక రూపాయి తక్కువ ధరకే డీజిల్ సరఫరా చేస్తాం. మాకు అనుమతివ్వండి అంటూ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని బంకుల యజమానులు ముందుకొస్తున్నారు. అంతే కాదు సరఫరా చేస్తున్నారు కూడా.. తక్కువ ధరకు డీజిల్ ఇస్తే మంచిదే కదా.. కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఎంతోకొంత కలిసొస్తుందని అనుకుంటే పొరపాటే. వారంతా కర్ణాటక నుంచి డీజిల్ తెప్పించి ఇక్కడ అమ్ముతున్నారు.
రాష్ట్రంతో పోలిస్తే కర్ణాటకలో లీటరు డీజిల్ దాదాపు 9 రూపాయల 70 పైసలు తక్కువ. రూపాయి తక్కువకే ఇస్తామని చెప్పి ప్రతి లీటరుపై ఎనిమిది రూపాయల లాభాన్ని జేబులో వేసుకుంటున్నారు. వైసీపీ నేతల అండదండలతో ఈ దందా నిరాటంకంగా సాగుతోంది. వాణిజ్య పన్నులశాఖ అధికారులు ట్యాంకర్లను పట్టుకుంటే రాష్ట్రంలోనే కొన్నట్లు పత్రాలు సృష్టించి తప్పించుకుంటున్నారు.
డీజిల్ దందాతో రోజూ ఖజానాకు కోటి రూపాయల వరకు గండికొడుతున్నారు . అనంతపురంలో ప్రస్తుతం డీజిల్ ధర లీటరు 99 రూపాయల 42 పైసలు. ఇందులో రాష్ట్రానికి వ్యాట్ రూపంలో 22.25 శాతం, ప్రతి లీటరుపై 4 అదనపు వ్యాట్, 1 శాతం రోడ్డు సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రాష్ట్ర ఖజానాకు ప్రతి లీటరుపై 27 చేరుతుంది.
డీజిల్‌ను కర్ణాటకలో కొనడం వల్ల మన రాష్ట్రానికి ప్రతి లీటరుపై 27 నష్టం వాటిల్లుతోంది. ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే రోజుకు లక్ష లీటర్లు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రతిరోజు 27 లక్షల ఆదాయం కోల్పోతున్నాం. ఉమ్మడి కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లోని అత్యధిక ఆర్టీసీ డిపోలకు, జేసీబీ, లారీల యజమానులకు కర్ణాటక డీజిల్‌నే సరఫరా చేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు రోజుకు కోటికి పైగా నష్టం వాటిల్లుతోంది.