MLC Elections Updates : రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లతో నిర్వహించినట్లు డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను సమర్థవంతంగా అమలు చేసిందని ఆయన అన్నారు. మొత్తం 56 ఎమ్‌సీసీ ఉల్లంఘన కేసులను నమోదు చేశామని, ముందస్తు చర్యలో భాగంగా మొత్తం 7,093 లైసెన్స్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మొత్తం 6,792 మందిని బైండోవర్ చేయడంతో పాటు 1,858 మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుతో పాటు 380 రూట్ మొబైల్లు, 365 స్ట్రైకింగ్ ఫోర్స్, 126 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ మరియు 64 క్యూ ఆర్డీలతో భద్రత కల్పించినట్లు వెల్లడించారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారన్నారు. ఈ నెల 16 న కౌంటింగ్ జరగనున్న ప్రదేశాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియను సంబంధిత ఎస్పీలతో నిరంతరం సమన్వయం చేసుకునేందుకు డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక ఎన్నికల నియంత్రణ సెల్ ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
రేపు రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ : తిరుపతి చిన్న బజారు వీధిలోని బూత్ నంబర్ 229, సత్య నారాయణపురంలోని బూత్ నంబర్ 233లో బుధవారం రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు రిటర్నింగ్ అధికారి, చిత్తూరు కలెక్టర్ హరి నారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెండు బూత్‌లలో రిగ్గింగ్ జరగడం, దీనిపై పోలీసు కేసు నమోదు కావడంతో ఎన్నికల సంఘం రీపో లింగ్ నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు.