అనంతపురంలోని ఆర్కేనగర్కు చెందిన కమలాకర్, మల్లిక కుటుంబం దసరా వచ్చిందంటే తమ నివాసంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. అందరిలా ఏదో ఒకలా బొమ్మలు ఒకచోట పెట్టరండీ వీళ్లు. సమాజానికి ఉపయోగపడేలా వినూత్నంగా ఆలోచించి కొలువు తీర్చిదిద్దుతారు. నైతిక విలువలు పెంపొందించేలా... దేవతల జీవిత కథలతో కూడిన విగ్రహాలు, తల్లిదండ్రులపై గౌరవం పెంపొందించే బొమ్మలు ఇక్కడ కనిపిస్తాయి. తమ ఇంటికి వచ్చే చిన్నారులకు దేవుళ్ల విశిష్టత తెలియచెప్పి వారిలో ఆధ్యాత్మిక భావం పెంపొందిస్తారు.
సంప్రదాయానికే పెద్దపీట
కమలాకర్, మల్లిక దంపతులకు ఏ ప్రదేశానికి వెళ్ళినా సంప్రదాయ విలువలు చాటే బొమ్మలు కొనడం అలవాటు. అమెరికా, చెన్నై, పాండిచ్చేరి, కొండపల్లి, హైదరాబాద్ ఇలా వివిధ ప్రాంతాల నుంచి ప్రతిమలు కొని ఈ వేడుక చేస్తారు.
పురాణ గాథలన్నీ బొమ్మల రూపంలో...
రామాయణ, మహాభారతంలోని కీలక ఘట్టాలను బొమ్మల రూపంలో చక్కగా వివరించారు. శ్రీ రామ జననం, సీతా స్వయంవరం, సీతాపహరణ, జటాయుమరణం, రావణాసురుని సంహారం, శ్రీ కృష్ణుని లీలలకు సంబంధించిన కళీయమర్థనంకు సంబంధించి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గజేంద్ర మోక్షం, శ్రీ లలితాదేవి వైభవం, సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన బొమ్మలు ఒకేచోట చేర్చారు. ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యతనూ బొమ్మల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కొత్త తరానికి తెలియచెప్పాలనే వీటిని నిర్వహిస్తున్నట్లు ఆనందంగా చెబుతున్నారా దంపతులు.