అనంతపురం జిల్లాలో రైతులందరికీ బీమా చెల్లించాలని అఖిలపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా బుక్కరాయసముద్రం సచివాలయాన్ని ముట్టడించారు. జిల్లాలో మూడేళ్లుగా పంట నష్టం జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ విమర్శించారు. ముఖ్యంగా 2018-19, 2019-2020 సంవత్సరాలకు సంబంధించి బీమా చెల్లించాలని.. శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను పోలీసులు అడ్డుకోవడం బాధాకరమన్నారు. పోలీసులు సైందవులుగా మారారన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని సూచించారు.
"స్వయంగా ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో రూ.940 కోట్లు అందజేస్తామని చెప్పి ఇంత వరకూ ఇవ్వలేదు. అలాగే జిల్లాలో కేవలం 34 మండలాలకు మాత్రమే పంటల బీమా వచ్చింది. మిగిలిన 30 మండలాల రైతుల పరిస్థితి ఏంటి? పంటల బీమా వచ్చినా రైతుల ఖాతాల్లో వేయలేదు". -జగదీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి