అనంతపురం జిల్లా కనేకల్ , బొమ్మనహాళ్ ఆంధ్ర సరిహద్దులోని తుంగభద్ర ఎగువ కాలువను (హెచ్ఎల్సీ) జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. హెచ్ఎల్సీ అధికారులతో కలిసి నీటి మట్టం, ఇరు రాష్ట్రాల నీటి లెక్కలపై ఆరాతీశారు. హెచ్ఎల్సీ కాలువ గట్టుల పరిస్థితిపై అధ్యయనం చేశారు. హెచ్ఎల్సీ ఆధునీకరణ పనులను సమీక్షించారు. నీటి వాటా లెక్కల రికార్డులు పరిశీలించారు. నీటి పంపిణీకి సంబంధించిన సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
కనేకల్ మండల కేంద్రంలోని శ్రీ చిక్కనేశ్వర చెరువు, హెచ్ఎల్సీ కాలువ, అక్విడేట్ను కలెక్టర్ పరిశీలించారు. ఆయకట్టు మాగాణి భూములను, ఆంధ్రా సరిహద్దు బొమ్మనహాళ్ మండలంలోని హెచ్ఎల్సీ గేజ్, గుంతకల్లు రిజర్వాయర్ను సందర్శించారు. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్ఎల్సీ ద్వారా ఆంధ్ర సరిహద్దులోకి వస్తున్న నీటిని గురించి అధికారులతో చర్చించారు. ఈ ఏడాది జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉండటంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందిస్తామని కలెక్టర్ చెప్పారు. ఐఏబీ సమావేశంలో చేసిన తీర్మానాల మేరకు నీటి కేటాయింపులు చేపడతామని తెలిపారు.